ఆధార్ త‌ర‌హాలోనే కేంద్రంహెల్త్ ఐడీ కార్డ్‌

ఆధార్ త‌ర‌హాలోనే కేంద్రం హెల్త్ ఐడీ కార్డ్‌ను జారీ చేయ‌నున్న‌ట్లు తెలియ‌వ‌చ్చింది. దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఈ హెల్త్ కార్డులు జారీ చేస్తే ఇక ముందు ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి, న‌గ‌రానికి వెళ్లిన‌ప్పుడు వెంట హెల్త్ రికార్డులు వెంట తీసుకెళ్ల‌న‌క్క‌ర్లేదు. ఆ కార్డు స‌మ‌ర్పిస్తే చాలు ఇంత‌కుముందు నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల నివేదిక‌లు తెలిసిపోతాయ్‌.. వాటి ఆధారంగా చికిత్స కూడా చేయొచ్చు.

ఈ నెలాఖ‌రులో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జాతీయ డిజిట‌ల్ హెల్త్ మిష‌న్ (ఎన్డీహెచ్ఎం)ను ప్రారంభిస్తార‌ని వార్త‌లొచ్చాయి. ఇందులో దేశ‌వ్యాప్తంగా ఉన్న ద‌వాఖాన‌లు, వైద్యులు, ల్యాబ్స్‌, కెమిస్ట్‌ల స‌మాచారం అంతా రికార్డ్ చేస్తారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన అండ‌మాన్ నికోబార్‌, చండీగ‌ఢ్‌, దాద్రాన‌గ‌ర్ హ‌వేలీ, డామ‌న్ దీవి, ల‌డ‌ఖ్‌, ల‌క్షద్వీప్‌ల్లో గ‌తేడాది ప్ర‌యోగాత్మ‌కంగా ఈ ప్రాజెక్టును చేప‌ట్టింది కేంద్రం. 

ఈ ప్రాంతాల వాసుల‌కు విశ్వ‌జ‌నీన‌ హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. త‌దుప‌రి ద‌శ‌లో ఈ స్కీమ్ దేశ‌మంతా అమ‌లు చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు తెలియ‌వ‌చ్చింది. ఈ స్కీమ్ ప్ర‌క‌టించిన వెంట‌నే గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్డీహెచ్ఎం (పీహెచ్ఆర్ అప్లికేష‌న్‌) అందుబాటులోకి వ‌స్తుంది. ఈ యాప్ ద్వారా ప్ర‌జ‌లంతా త‌మ పేర్లు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు.

విశ్వ‌జ‌నీన ఐడీ 14 డిజిట్స్‌తో వ‌స్తుంది. స్మార్ట్ ఫోన్లు లేని వారికి ప్ర‌భుత్వ‌-ప్రైవేట్ ద‌వాఖాన‌లు, క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్లు, ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్లు, వెల్‌నెస్ సెంట‌ర్లు, కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ చేస్తారు. పేరు, జ‌నన తేదీ, మొబైల్ ఫోన్ వివ‌రాలు చేరుస్తారు.

ఈ కార్డుల జారీ ప్ర‌క్రియ పూర్త‌యితే మీ హెల్త్ రికార్డుల‌న్నీ డిజిట‌ల్ ఫార్మాట్‌లో న‌మోద‌వుతాయి. పూర్తి మెడిక‌ల్ హిస్ట‌రీ ఆవిష్కృత‌మౌతుంది. చికిత్స కోసం ద‌వాఖాన‌కు వెళ్లినా.. డిజిట‌ల్ ఫార్మాట్‌లో పాత రికార్డులు తెలుసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల చికిత్స తేలిక‌వుతుంది. నూత‌న ప‌రీక్ష‌ల నివేదిక‌ల కోసం స‌మ‌యం, ఖ‌ర్చు త‌గ్గుతుంది.

హెల్త్ కార్డ్ జ‌న‌రేట్ అయ్యాక ఇంత‌కుముందు వైద్య ప‌రీక్ష‌ల నివేదిక‌ల ప్ర‌తుల‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తారు. త‌దుప‌రి నివేదిక‌ల‌న్నీ ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతాయి. 14 అంకెల డిజిట‌ల్ నంబ‌ర్ ఫీడ్ చేస్తే మీ మెడిక‌ల్ హిస్ట‌రీ అంతా కనిపిస్తుంది. 

చివ‌రిగా మీరు వాడిన ఔష‌ధం ఏమిటి.. ఎందుకు దాన్ని మార్చారు త‌దిత‌ర వివ‌రాల‌న్నీ తెలుస్తాయి. రిజిస్ట‌ర్డ్ ద‌వాఖాన కంప్యూట‌ర్‌లో 14 అంకెల డిజిట‌ల్ నంబ‌ర్ ఫీడ్ చేయ‌గానే మీ ఫోన్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని న‌మోదు చేస్తే మీ మెడిక‌ల్ హిస్ట‌రీ అంతా బ‌య‌ట‌ప‌డుతుంది.