కర్నల్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. పలు దఫాలుగా రైతు నేతలతో సమావేశమై ఈ మేరకు విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలను విరమించుకుంటున్నట్లు రైతులు ప్రకటించారు. కర్నల్‌లో రైతులపై గత నెల 28 న లాఠీఛార్జీ జరిగింది. ఈ ఘటనలో పది మందికి పైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు.
కర్నల్‌లో బీజేపీ చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బస్తారా టోల్ ప్లాజా వైపు పెద్ద సంఖ్యలో రైతులు రావడం మొదలుపెట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించాడని రైతులు ఆరోపిస్తున్నారు.
దీనిపై రైతుల సంఘాలు భగ్గుమన్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనలకు పిలుపునివ్వడంతో హర్యానాలో పరిస్థితులు విషమంగా తయారయ్యాయి. దాంతో రైతు నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. రిటైర్డ్ హైకోర్ట్ న్యాయమూర్తితో విచారణ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నెల రోజుల్లోపు నివేదిక అందించాలని కూడా ప్రభుత్వం సూచించింది. మాజీ ఎస్‌డీఎం ఆయుష్ సిన్హాను సెలవుపై పంపనున్నట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి దేవేందర్ సింగ్ తెలిపారు.
లాఠీఛార్జీలో గాయపడి మరణించినట్లు చెప్తున్న రైతు కుటుంబంలో నుంచి ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ప్రకటించారు. దీంతో గత వారం రోజులుగా చేస్తున్న ఆందోళనను విరమించుకునేందుకు రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతుల తలలు పగలగొట్టండి అని ఆదేశాలిచ్చిన ఎస్‌డీఎం ఆయుష్ సిన్హాను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం