ఢిల్లీలో రికార్డు స్థాయిలో కుంభవృష్టి

ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఢిల్లీలో కుంభవృష్టి కురుస్తోంది. రానున్న 12 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధానికి ప్రభుత్వం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాజధానిలో శుక్రవారం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో 18 ఏళ్ల రికార్డు బద్దలయింది. 18 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. 

శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలుపడుతున్నారు. నిన్న తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన జడివానకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

వర్షాలతో ఢిల్లీలోని నారేలా ప్రాంతంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. మధు విహార్‌, జోర్‌బాగ్‌, మోతీబాగ్‌, ఆర్‌కేపురం, సదర్‌ బజార్‌ ప్రాంతాలు నీటితో రోడ్లు నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాణిఖేదాలోని అండర్‌పాస్‌ మొత్తం నీటితో మునిగిపోయింది. రేపు ఉదయం వరకు భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులతో సెప్టెంబర్‌ 16-17 తేదీల్లో కుంభవృష్టి కురుస్తుందని పేర్కొంది.

పలు చోట్ల రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. అండర్‌పాస్‌ వంతెనల వద్ద నీరు నిలవడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గత 24 గంటల్లో నగరంలో 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు.

ఢిల్లీలో అతి భారీ వర్షాలు కురవడం 10 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత వారం ప్రారంభంలో భారీ వర్షాలకు ఢిల్లీ, ఎన్సిఆర్ లు వణికిపోయాయి. మధ్యలో దాదాపు వారం గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. ఈసారి నైరుతి రుతు పవనాలు ఢిల్లీని ఆలస్యంగా పలకరించాయి. చాలా ఆలస్యంగా ఢిల్లీపై రుతు పవనాల ప్రభావం మొదలైంది. 

ఇంత ఆలస్యం కావడం ఇప్పటివరకు ఇదే మొదటిసారి. అయితే వాటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన వర్షపాతం వెయ్యి మిల్లీ మీటర్లు దాటిపోయింది. ఆ తర్వాత ఈ స్థాయిలో వర్షం పడడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2010లో వర్షపాతం వెయ్యి మిల్లీ మీటర్ల మార్క్ దాటింది. ఈసారి ఇఫ్పటికే వెయ్యి ఐదు మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఢిల్లీలో సాధారణ వర్షపాతం 648.9 మిల్లీమీటర్లు.