జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా ఇక్బాల్ సింగ్

2012 లో బిజెపిలో చేరిన మాజీ ఐపిఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్‌పురా జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.
లాల్పురా, ఐపిఎస్ అధికారిగా ఉన్న సమయంలో, ఎస్‌ఎస్‌పి అమృత్‌సర్, ఎస్‌ఎస్‌పి తరంతరన్, అదనపు ఇన్స్‌పెక్టర్ జనరల్ సిఐడి అమృత్‌సర్‌గా పనిచేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత 2012 లో బిజెపిలో చేరారు.
 

లాల్పురా మైనారిటీల కమిషన్ ఛైర్మన్ అయిన రెండవ సిక్కు. ఆయనకు ముందు, 2003 నుండి 2006 వరకు ఛైర్మన్‌గా తర్లోచన్ సింగ్ మాత్రమే పనిచేశారు. మొదటి నుండి నుండి, కమిషన్ ఛైర్మన్ గా ఎక్కువగా ముస్లింలనే నియమిస్తున్నారు.  లాల్పురాకు ముందు, సయ్యద్ గయోరుల్ హసన్ రిజ్వీ పనిచేశారు. ఆయన పదవీకాలం గత ఏడాది మేలో ముగిసింది.

“నేను దేశవ్యాప్తంగా మైనారిటీల ప్రయోజనాలను కాపాడటానికి పని చేస్తాను మరియు ఈ బాధ్యత కోసం నన్ను ఎంచుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని లాల్పురా అన్నారు.

జాతీయ మైనారిటీల కమిషన్ ఛైర్మన్‌గా నియమించడానికి ముందు, ఆయన బిజెపి జాతీయ ప్రతినిధిగా టెలివిజన్ చర్చలలో ప్రముఖంగా కనిపిస్తూ ఉండేవారు. లాల్పురా సిక్కు తత్వశాస్త్రం,  చరిత్రపై ‘జప్జీ సాహిబ్ ఏక్ విచార్’, గుర్బానీ ఏక్ విచార్,  రాజ్ కరేగా ఖల్సా వంటి దాదాపు 14 పుస్తకాలు రాశారు.

పంజాబ్ తీవ్రవాదాన్ని పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న సమయంలో లాల్పురా చురుకైన పోలీసు అధికారిగా పేరొందారు. ఆయన  గెలుచుకున్న పురస్కారాలలో రాష్ట్రపతి పోలీసు పతకం, మెరిటోరియస్ సేవలకు పోలీసు పతకం, శిరోమణి సిక్కు సాహిత్కర్ అవార్డు, సిక్కు పండితుల పురస్కారం మొదలైనవి ఉన్నాయి.

 
జర్నైల్ సింగ్ భింద్రావాలేను అరెస్టు చేయడానికి ఏప్రిల్, 1981లో  ఎంపికైన ముగ్గురు అధికారులలో ఆయన ఒకరు. రైతుల పోరాటంలో, లాల్‌పురా పంజాబ్‌లోని పలు ప్రాంతాలను పదేపదే సందర్శించారు. సంగ్రూర్, బర్నాలలో నిరసనలను ఎదుర్కొన్నారు. ఆయన రాష్ట్రంలోని రోపర్ జిల్లాకు చెందినవారు.
 

లాల్పురా 1978 లో సిక్కు-నిరంకారీ ఘర్షణకు సంబంధించిన దర్యాప్తు అధికారి.  దీనిని పంజాబ్‌లో తీవ్రవాదానికి దారితీసిన సంఘటన గా, భీంద్రన్ వాలే పెరుగుదలకు కారణంగా భావిస్తుంటారు. ఆనాటి ప్రభుత్వం తరపున ఉగ్రవాదులతో ప్రధాన సంధానకర్తగా వ్యవహరించిన పోలీస్ అధికారి.

లాల్పురా నియామకం కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో రాజకీయ ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇక్కడ బీజేపీ రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఆయన ఇటీవల జాతీయ పదవికి ఎంపికైన రెండవ పంజాబ్ నాయకుడు. గతంలో, రాష్ట్ర మాజీ మంత్రి విజయ్ సంప్లాను జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ గా నియమించారు.

“లాల్పురా జీ దేశవ్యాప్తంగా మైనారిటీల కోసం విశేషంగా కృషి  చేస్తారని మేము ఆశిస్తున్నాము” అని పంజాబ్ బిజెపి అధికార ప్రతినిధి అనిల్ సరీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.