త్రిపురలో సిపిఎం అశాంతిని రేకెక్తిస్తే ప్రజలు సహించరు!

త్రిపురలో అశాంతిని రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు సహింపరాని అంటూ సిపిఎంను ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ హెచ్చరించారు. గత 3 సంవత్సరాలుగా, త్రిపుర శాంతి,  శ్రేయస్సును చూస్తున్నదని, శాంతిభద్రతలు విశేషంగా మెరుగయ్యాయని ఆయన తెలిపారు. దానితో సిపిఎం రగిలిపోతున్నదని విమర్శిస్తూ వరుసగా ట్వీట్ లు ఇచ్చారు.

కోల్పోయిన రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందాలనే  నిరాశలో వారు త్రిపురను అశాంతిలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. “మా కొత్త త్రిపురలో అటువంటి హింసాత్మక రాజకీయ ప్రవర్తనను ప్రజలు సహించరని నేను సిపిఎంకు గుర్తు చేయాలనుకుంటున్నాను. చట్టం ప్రకారం ప్రతి దుర్మార్గుడిని గుర్తించి శిక్షించడం నా అత్యున్నత ప్రయత్నం. శాంతి అనేది బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంకు రాజీలేని ప్రాధాన్యత” అంటూ ఆయన స్పష్టం చేశారు.

బుధవారం, సిపిఎం దినపత్రిక దేశర్ కథ, స్థానిక బెంగాలీ ఉదయం దినపత్రిక ప్రతిబడి కలామ్,  స్థానిక టీవీ ఛానెల్‌లు పిబి 24, దురంత టివి కార్యాలయాలతో సహా రాష్ట్రంలోని నాలుగు మీడియా సంస్థలు దాడులకు గురయ్యాయి.

“మీడియా సంస్థ కార్యాలయంపై దాడి జరిగినట్లు కలవరపెట్టే నివేదికలు కూడా నేను విన్నాను. మన  ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం.  అందరూ గౌరవించాలి. దాడి వెనుక ఉన్నవారిని మేము గుర్తించి, సత్వర న్యాయం జరిగేలా చూస్తాము. నేను నా మీడియా మిత్రులందరికీ సంఘీభావంగా నిలుస్తాను ” అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

ఈ దాడులకు బిజెపి కారణమని సిపిఎం ఆరోపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ట్వీట్ లు వచ్చాయి. ఈ దాడులపై స్పందించిన బిజెపి అధికార ప్రతినిధి నబేందు భట్టాచార్య, “ఇది జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. మా అగ్ర నాయకులు దాని గురించి చర్చిస్తారు. అది నిజమైతే, అవసరమైన చర్యలు తీసుకోబడతాయి” అంటూ హామీ ఇచ్చారు.

సెపహిజాలా జిల్లాలోని సోనామురా వద్ద సిపిఎం మద్దతుదారులు ఆరోపిస్తున్న వీడియోలను కూడా ముఖ్యమంత్రి షేర్ చేస్తూ  “సెప్టెంబర్ 6న, మాజీ సిఎం మాణిక్ సర్కార్, డ్రగ్ మాఫియాల గుంపుకు నాయకత్వం వహించారు. సోనామురాలో బిజెపి కార్యకర్తలపై దాడి చేయడానికి వారిని ప్రేరేపించారు. అనేక మంది బిజెపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది ఇప్పటికీ జిబి ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇది సిపిఎమ్ వారి ప్రావీణ్యం పొందిన రాజకీయ విధానం, ” అంటూ ధ్వజమెత్తారు.

కాగా,  రాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్, సిపిఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు బిజన్ ధర్ మాట్లాడుతూ, కనీసం 26 పార్టీ కార్యాలయాలు ధ్వంసంకు గురయిన్నట్లు, వందమంది కార్యకర్తల ఇల్లు దాడులకు గురయిన్నట్లు ఆరోపించారు.