ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్ తొలిపూజ

తెలంగాణాలో రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి పండగ శోభ మొదలైంది. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు గణనాథుడు పూజలందుకోనున్నారు. అటు వినాయక ఉత్సవాలకు ఖైరతాబాద్ గణేషుడు ముస్తాబయ్యాడు. స్వామివారికి 60 అడుగుల గరికమాల, జంద్యం, కండువా సమర్పించార పద్మశాలీలు.  ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజ జరిగింది. 
గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్ కుటుంభం సమేతంగా దర్శించుకొని గణేశునికి తొలి పూజ జరిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దంపతులు కూడా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 5 అడుగుల మట్టిగణపతి విగ్రహాన్ని పంపించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్యెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్యెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు కూడా దర్శించుకున్నారు. 
 
స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 30 సీసీ కెమెరాలతో పాటు… 150 మంది ప్రైవేట్ వలంటీర్లను ఏర్పాటు చేసింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ. రాష్ట్రంలో వినాయక చవితి సందడి అంతా ఖైరతాబాద్ గణేషుడి చుట్టూనే తిరుగుతుంటుంది. ఎత్తయిన విగ్రహం కావటంతో అందరి చూపు ఖైరతాబాద్ వినాయకుడిపైనే ఉంటుంది. 
 
దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి ఏటా ఒక్కో రూపంలో వినాయక విగ్రహాన్ని తయారు చేస్తుంటారు. ఈ ఏడాది 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసింది ఉత్సవ కమిటీ. గతేడాది కరోనాతో కేవలం 9 అడుగుల ప్రతిమను పెట్టారు. ఈ ఏడు ఖైరతాబాద్ లంబోదరుడు పంచముఖ రుద్ర మహాగణపతిగా ఐదు తలలతో దర్శనం ఇస్తున్నారు.
 
ఎడమవైపు కాలనాగ దేవత, కుడివైపు కృష్ణ కాళీ విగ్రహాలు 15 అడుగులతో ఏర్పాటు చేశారు. ఈ నెల 19న గణేశ్ నిమజ్జనం జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.
 
వినాయకుడి రూపాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా ఎక్కువే.  ప్రతి ఏడాది దాదాపు 3 నెలలకు పైగా కళాకారులు విగ్రహాన్ని సిద్ధం చేసేవారు. వినాయక విగ్రహాన్ని 23 అడుగుల ఎత్తుతో చేయాలని భావించినా.. ఖైరతాబాద్  గణపతిని తక్కువ ఎత్తుతో చూడలేమని భక్తులు అభ్యంతరం తెలపడంతో 40 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించారు.

ఖైరతాబాద్  గణేషుడికి ఇరువైపులా ప్రతియేటా దేవతా మూర్తులను ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈసారి గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తుతో కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహం రూపొందించారు. పుట్టల నడుమ భారీ నాగ దేవతపై కొలువుండే విధంగా కాల నాగేశ్వరి అమ్మవారిని ప్రత్యేక సెట్టింగ్ మధ్య తయారు చేశారు. 

 
ఎడమ వైపున కృష్ణకాళి రూపంలో మరో విగ్రహాన్ని తయారు చేశారు. భాగవతం సమయంలో శ్రీకృష్ణుడు కాళీ మాతను పూజించి అనుగ్రహించాలని కోరగా ఆమె శ్రీకృష్ణుడిపైనే ఆవహించిన స్వరూపంగా కృష్ణకాళి ఉగ్ర స్వరూపంతో విగ్రహం కొలువుదీరింది. ఆమె పక్కన కృష్ణుడి మాతృమూర్తి యశోదాదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

భారీ వినాయకున్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దాదాపు 120 మంది కళాకారులు కేవలం 45 రోజుల్లోనే ఈ పంచ ముఖ రుద్ర మహాగణపతి విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతిసారీ దాదాపు 3 నెలల పాటు విగ్రహ తయారీకి సమయం పట్టేది. ఈసారి తక్కువ రోజుల్లో రాత్రింబవళ్లు కష్టపడి విగ్రహాలను రెడీ చేశారు. షెడ్డు నిర్మాణం కోసం ఆదిలాబాద్ కు చెందిన నర్సయ్య నేతృత్వంలో 16 మంది ప్రత్యేక నిపుణులు పనిచేశారు. వెల్డింగ్  పనులను మచిలీపట్నంకు చెందిన నాగబాబు నేతృత్వంలో 15 మంది కళాకారులు పూర్తి చేశారు.

బంకమట్టి పనులను చెన్నైకి చెందిన గురుమూర్తికి చెందిన 20 మంది టీం చేసింది. ప్లాస్టర్  ఆఫ్  పారిస్  ఔట్ లైన్  పనులను మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన 15 మంది టీం చేపట్టింది. తుదిమెరుగులు దిద్దే పనులను బిహార్ కు చెందిన సంతోష్ తో పాటు 10 మంది కళాకారులు చేశారు. 

 
పెయింటింగ్  పనులను కాకినాడకు చెందిన భీమేష్  ఆధ్వర్యంలో 12 మంది పూర్తి చేశారు. విగ్రహ తయారీకి 30 కిలోల బరువుండే 200 బ్యాగుల బంక మట్టి, 20 టన్నుల స్టీలు, 2వేల మీటర్ల గోనె సంచులు, 2,500 బ్యాగుల ప్లాస్టర్  ఆఫ్  పారిస్ , 30 కిలోల బరువుండే 30 బండిళ్ల కొబ్బర నార, ఏషియన్  పెయింట్స్ కు చెందిన వాటర్  కలర్స్ ను వాడారు.

పార్వతి, పరమ శివుడు, వినాయకుడు, మహావిష్ణువు, సూర్య భగవాను ముఖాలతో మహా గణపతిని తీర్చిదిద్దారు. విగ్రహం కింది భాగంలో ఐదుగురు దేవతల వాహనాలైన సింహం, నంది, మూషికం, గరుత్మంతుడు, అశ్వాలను తయారు చేశారు.

 
వినాయకుడికి 10 చేతులుండగా కుడివైపున చక్రం, త్రిశూలం, గొడ్డలి, నాగుపాము, ఆశీర్వాదహస్తం, ఎడమ వైపున శంఖు, పాశము, కమలం, గద, లడ్డూ ఉన్నాయి. ఖైరతాబాద్ గణేషుడి పొడవు 40 అడుగులు కాగా, వెడల్పు 27 అడుగులుగా ఉంది. బరువు  25 నుండి 28 టన్నులుంది. విగ్రహ తయారీ మొత్తం ఖర్చు 50 లక్షలకు పైనే అయింది.