ఆఫ్ఘన్ సంక్షోభానికి శాంతియుతంగా పరిష్కారం… బ్రిక్స్ దేశాలు

ఆఫ్ఘనిస్థాన్‌ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని బ్రిక్స్‌ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాల సమూహం బ్రిక్స్‌ 13వ సదస్సు భారత్‌ అధ్యక్షతన గురువారం ఆన్‌లైన్‌లో జరిగింది.  ప్రస్తుతం అక్కడ పరిస్థితి కల్లోలంగా ఉండటం పట్ల బ్రిక్స్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.

తాలిబన్ల ఆక్రమణతో సంక్షోభంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో హింసకు తావివ్వకూడదని, శాంతియుత మార్గాల ద్వారా పరిస్థితిని పరిష్కరించాలని బ్రిక్స్‌ దేశాల నేతలు పిలుపునిచ్చారు. ఆ దేశంలో స్థిరత్వం, పౌర శాంతి, శాంతిభద్రతల కోసం ఆఫ్ఘన్‌పై అంతర్గత చర్చలు జరుగాలని ఆకాక్షించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదుల స్థావరంగా ఆఫ్ఘన్‌ మారకుండా, ఇతర దేశాలపై ఉగ్ర దాడులకు పాల్పడకుండా చూడటం, సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలు, టెర్రరిజం ఫైనాన్సింగ్ నెట్‌వర్స్‌ను కట్టడి చేయడం వంటివి ఢిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన బ్రిక్స్‌ ఆన్‌లైన్‌ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పాల్గొన్నారు.

అక్కడ మహిళలు, పిల్లలు, మైనార్టీల సంరక్షణకు వెంటనే సకల చర్యలు తీసుకోవల్సి ఉందని తెలిపారు. ముందు అక్కడ సుస్థిరత, పౌరుల శాంతియుత జీవనక్రమం నెలకొనాల్సి ఉంది. శాంతిభద్రతలు మెరుగుపడాలి. ఈ దిశలో సమీకృత అప్ఘన్ అంతర్గత సంప్రదింపులు జరగాల్సి ఉందని తెలిపారు. ప్రధానంగా అఫ్ఘనిస్థాన్‌నే కేంద్రీకృతం చేసుకుని ఈ బ్రిక్స్ సదస్సు జరిగింది.

 అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త సంక్షోభం నెలకొన్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. ప్రపంచం, ఈ ప్రాంత భద్రతపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న దానిపై స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  బ్రిక్స్‌ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలపై దృష్టి కేంద్రీకరించడానికి బ్రిక్స్ ప్లాట్‌ఫాం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

‘ఈ రోజు మనం ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఒక ప్రభావవంతమైన స్వరం. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలపై కూడా దృష్టి కేంద్రీకరించడానికి ఈ వేదిక ఉపయోగకరంగా ఉంది’ అని చెప్పారు. బ్రిక్స్‌ 15వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ సదస్సు థీమ్‌ను ‘BRICS@15: కంటిన్యూటీ, కన్సాలిడేషన్, ఏకాభిప్రాయం కోసం ఇంట్రా-బ్రిక్స్ సహకారం’గా పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీ బ్రిక్స్‌ సదస్సుకు అధ్యక్షత వహించడం ఇది రెండోసారి. 2016లో జరిగిన గోవా సదస్సుకు కూడా ఆయన అధ్యక్షత వహించారు.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న పరిస్థితిపై బ్రిక్స్ సభ్యదేశాలన్నీ ఓ నిర్ణయానికి వచ్చాయిని, అఫ్గానిస్తాన్‌కు సంబంధించి భారత్ ప్రతిపాదించిన ఓ ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్‌ను సభ్య దేశాలన్నీ ఒప్పుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. 

అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించేందుకు బ్రిక్స్ సదస్సు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మనం గళంగా నిలిచాం. అలాగే ఆయా దేశాలకు ఏది ముఖ్యం అనే విషయాలపై దృష్టి కేంద్రీకరించేందుకు బ్రిక్స్ వేదిక ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది’ అని మోదీ తెలిపారు.