హుస్సేన్‎సాగర్‏‎లో నిమజ్జనాలపై హైకోర్టు ఆంక్షలు

హుస్సెన్‎సాగర్‏‎లో వినాయకుడి నిమజ్జనాలపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సెన్‎సాగర్‏‎లో నీరు కలుషితం కాకుండా ఉండాలంటే.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‎తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని చెప్పింది. ఈ రకమైన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రత్యేక కుంటలు ఏర్పాటుచేయాలని సూచించింది. 

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‎ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అక్కడే ఈ విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.  సాగర్‌లో విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై నుంచి కాకుండా సచివాలయం, ఎన్‌టీఆర్‌ మార్గ్‌, పీవీ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, సంజీవయ్య పార్క్‌ రోడ్డు వైపు నుంచి అనుమతివ్వాలని చెప్పింది.

పర్యావరణ పరిరక్షణ, జల, వాయు కాలుష్యాలను అరికట్టేందుకు వీలుగా పలు మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, న్యాయమూర్తి జస్టిస్‌ టీ వినోదద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని కోర్టు సూచించింది. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. దూర ప్రాంతాల నుంచి నిమజ్జనాల కోసం ఒకే రోజు హుస్సేన్ సాగర్‎కు రాకుండా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువ రాకుండా చూడాలని, ఇండ్లలో ప్రతిష్టించిన విగ్రహాలకు.. ఇంటి వద్ద బకెట్లలో నిమజ్జనం జరిగేలా చూడాలని చెప్పింది. కరోనా మూడో దశవ్యాప్తి హెచ్చరికల నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. 

నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందించాలని చెప్పింది. నిమజ్జనం తర్వాత వెంటనే డెబ్రీస్ తొలగించాలని ఆదేశించింది. నిమజ్జనానికి వచ్చే వారు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. 

రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దని ఆదేశించింది. మండపాల వద్ద ఎక్కువమంది గుమిగూడకుండా పోలీసులు చూడాలని చెప్పింది. మండపం నిర్వాహకులు శానిటైజర్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని హైకోర్టు చెప్పింది. రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, హైకోర్టు ముందు వాస్తవ  విషయాలను ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ విమర్శించారు. ప్రభుత్వం సరైన వాదనలు వినిపించడంలో నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. గణేష్ నిమజ్జనోత్సవం పై ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వానిదే అని స్పష్టం చేస్తూ  -సరైన న్యాయపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు గౌరవించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

రోజువారి కాలుష్యాన్ని నివారించలేని వివిధ ప్రభుత్వ విభాగాలు తమ అవినీతిని,అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి గణపతి ఉత్సవాలపై విషప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని భక్తులు ఈ సంవత్సరం కూడ ఘనంగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.