వరదలతో జనం అల్లాడుతున్నా కేసీఆర్ పట్టించుకోరా?

భారీ వర్షాలు, వరదలతో లక్షలాది ఎకరాలు పంట నష్టపోయి, ఆస్తి నష్టమై రైతులు, జనం అల్లాడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. కిలోమీటర్ కో బార్…బీర్ అంటూ మద్యంపై ఉన్న ధ్యాస పేదోడి కన్నీళ్లు తుడవడంపై లేదని విమర్శించారు. 

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 13వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ గురువారం మధ్యాహ్నం చౌట్ కూర్ మండల కేంద్రంలో హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ “పాదయాత్రలో ప్రజలు బాధలు చెప్పుకుంటున్నరు. రోడ్డు కోసం స్థలమిస్తే….ఇండ్లు కట్టిస్తానన్నడు. కానీ కట్టియ్యలేదు. నేను వెళ్లి చూసిన ఎట్ల బతుకున్నరో అని బాధేస్తుంది” అని చెప్పారు.

‘‘తెలంగాణలో 6.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా వేసిండ్రు. జనం చస్తుండ్రు. రైతులు నష్టోయిండ్రు. కానీ సార్ పోయి ఢిల్లీ పోయి పడుకుండు. ఇక్కడ పీకేది లేదు. అక్కడ పీకేది లేదు. అసలు ఫాంహౌజ్ లో ఏం చేస్తడో అర్ధం కాలేదు. 7 ఏళ్లు ఫాంహౌజ్ కే పరిమితమైండు” అంటూ విమర్శించారు.

బయట పేదోడికి కోవిడ్ వచ్చినా డాక్టర్లు రారు…కానీ కేసీఆర్ ఫాంహౌజ్ లో కుక్కకి సుస్తీ అయినా అంబులెన్సులు వెళతాయి. కేసీఆర్ కుక్కకున్న విలువ. పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో వరదలొస్తే సీఎం రాలేదు. వరంగల్ లో వరదలొచ్చి పేదల ఇండ్లు మునిగిపోయినయ్. సీఎం మాత్రం హైదరాబాద్ దాటి రాలేదని గుర్తు చేశారు.

ఆర్టీసీ కార్మికులు చస్తే కనీసం స్పందించలేదు. మూర్ఖపు సీఎం కొడుకు నిర్లక్ష్యంవల్ల ఇంటర్మీడియట్ కు చెందిన 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శ లేదు. పేదోళ్ల ఓట్లతో కేసీఆర్ గెలవలేదా? ఇది పేదల ప్రభుత్వం కాదా? మీకు పేదలు అక్కర్లేదా? అంటూ సంజయ్ ప్రశ్నించారు.

ఈ ప్రాంతానికి సింగూరు నీళ్లిస్తామని, తరువాత కాళేశ్వరం నీళ్లిస్తామని చెప్పి మాట తప్పి అంచనాలు పెంచి వేల కోట్లు కమీషన్లు దండుకుంటున్నడని ఆరోపించారు. ఎన్నికలొస్తే కేసీఆర్ కోతలు కోస్తడు. ఊకదంపుడు ఉపన్యాసాలిస్తడు. కానీ చేసేదేమీ ఉండదని విమర్శించారు.

దళితులకు 3 ఎకరాలన్నడు. ఎంతమందికి ఇచ్చిండు? ఇంటికో ఉద్యోగమిస్తనన్నడు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తనన్నడు. కానీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంటేనే దళితులను వంచించే పార్టీ అని సంజయ్ ధ్వజమెత్తారు. దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్ధం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ లో రూ.100 కోట్లతో రూములు కట్టుకున్నడే తప్ప అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం పెట్టలేదని మండిపడ్డారు. 

బీజేపీ మీ కష్టాలు, కన్నీళ్లను తెలుసుకుని భరోసా నింపేందుకు…మీ సమస్యలను 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17 నిర్మల్ అమిత్ షా హాజరయ్యే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ రావాలని కోరారు. 

కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపించి తీరుతామని సంజయ్ స్పష్టం చేశారు.  తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా ఎంఐఎం నేతలకు భయపడి విమోచన దినోత్సవాన్ని జరపడానికి వెనుకాడుతున్న అవకాశవాది కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు.