56 రవాణా విమానాల కొనుగోలు

అత్యాధునిక సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాల కొనుగోలుకు కేబినెట్‌ భద్రతా కమిటీ బుధవారం ఆమోదించింది. 2.5 బిలియన్‌ డాలర్ల (రూ.18,451 కోట్లు) వ్యయంతో స్పెయిన్‌కు చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ నుంచి సమకూర్చుకునేందుకు అంగీకారం తెలిపింది. 

ఇందులో 40 రవాణా విమానాలను దేశంలోనే తయారు చేయనున్నారు. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఇందులో భాగంగా స్పెయిన్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీతో పాటు టాటా కన్సార్షియం కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది.

ప్రస్తుతం ఉన్న అవ్రో ఎయిర్‌క్రాఫ్ట్‌ స్థానంలో ఈ విమానాలను తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘ఆత్మనిర్భర్‌ అభియాన్‌’ను ప్రోత్సహించడానికే వీటి తయారీని భారత్‌లో చేపడుతున్నట్టు పేర్కొంది.  కాంట్రాక్టుపై ఒప్పందం కుదిరాక నాలుగు ఏండ్లలో 16 సీ-295 రవాణా విమానాలు స్పెయిన్‌ నుంచి సరఫరా అవుతాయి.

పదేళ్లలో 40 విమానాలను టాటా కన్సార్టియం దేశంలో తయారు చేస్తుంది. మొత్తం 56 రవాణా విమానాలు స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థను కలిగి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

సి-295 MW అత్యాధునిక సాంకేతికత, 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన రవాణా విమానం. భారత వాయుసేనకు చెందిన పురాతన అవ్రో విమానాలను ఇవి భర్తీ చేస్తాయి. శీఘ్ర ప్రతిచర్య, సైనిక దళాలు, సరుకు రవాణా కోసం విమానం వెనుక ర్యాంప్ డోర్‌ ఉంటుంది.

మరోవైపు ఈ ప్రాజెక్టు దేశంలో ఏరోస్పేస్ రంగం బలోపేతంతోపాటు ఉపాధి కల్పనకు ఊతమిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్య ఉద్యోగాలతోపాటు 3,000 పరోక్ష ఉద్యోగాలు, అదనంగా 3000 మధ్యతరహా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని వెల్లడించింది.

ఓ ప్రైవేట్‌ కంపెనీ ద్వారా భారత్‌లో మిలిటరీ విమానాల తయారీని చేపట్టడం ఇదే తొలిసారి. సీ-295 ఎండబ్ల్యూ రకానికి చెందిన ఒక్కో విమానం 5-10 టన్నుల బరువును మోయగలదు. క్లిష్ట సమయాల్లో వెనుక నుంచి దూకేందుకు ప్రత్యేక ద్వారం, సైనికులు, అవసరమైన సామగ్రిని దింపేందుకు పారా డ్రాపింగ్‌ వ్యవస్థ వీటిల్లో అందుబాటులో ఉంటుంది.