తిరుప‌తి స‌హా 13 ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటీక‌ర‌ణ‌

ఆస్తుల న‌గ‌దీక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం తొలి అడుగు వేసింది. దేశంలోని 13 ఎయిర్‌పోర్ట్‌ల‌ను ప్రైవేటీక‌రించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తుది అనుమ‌తి ఇచ్చింది. 

నేష‌న‌ల్ మానిటైజేష‌న్ పైప్‌లైన్‌లో భాగంగా 2024 ఆర్థిక సంవ‌త్స‌రం నాటికి ఎయిర్‌పోర్ట్‌ల‌లో రూ.3660 కోట్ల ప్రైవేట్ పెట్టుబ‌డుల‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. 13 ఎయిర్‌పోర్ట్‌ల‌లో ఆరు మేజ‌ర్ ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి.

భువనేశ్వ‌ర్‌, వార‌ణాసి, అమృత్‌స‌ర్‌, తిరుచ్చి, ఇండోర్‌, రాయ్‌పూర్‌ల‌తోపాటు తిరుప‌తి, జార్సుగూడా, గ‌య‌, ఖుషీన‌గ‌ర్‌, కాంగ్రా, జ‌బ‌ల్‌పూర్‌, జాల్గావ్‌లాంటి ఏడు చిన్న ఎయిర్‌పోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఒక బిడ్ డాక్యుమెంట్ సిద్ధం చేయ‌డానికి ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించ‌నుంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో బిడ్స్‌ను ఆహ్వానించ‌నుంది.

ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటైజేష‌న్ ప్ర‌క్రియ‌లో తొలిసారి మేజ‌ర్ ఎయిర్‌పోర్ట్‌ల‌తో చిన్న ఎయిర్‌పోర్ట్‌ల‌ను క‌లుపుతున్నారు. తిరుప‌తి ఎయిర్‌పోర్ట్‌ను తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌తో క‌ల‌ప‌నుండ‌గా.. జార్సుగూడ‌ను భువ‌నేశ్వ‌ర్‌తో, ఖుషీన‌గ‌ర్‌, గ‌య ఎయిర్‌పోర్ట్‌ల‌ను వార‌ణాసితో, కాంగ్రాను రాయ్‌పూర్‌తో, అమృత్‌స‌ర్‌ను జ‌బ‌ల్‌పూర్‌తో క్ల‌బ్ చేయ‌నున్నారు.