
ఈ ఏడాది పది రోజుల దీపావళి ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రారంభింనున్నారు. ఈ సందర్భంగా జరిగే దీపోత్సవ్ లో ఆయన పాల్గొననున్నారు. వచ్చే ఏడాది మొదట్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ప్రధాని పాల్గొనడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో నిర్వహించే చివరి దీపావళి ఉత్సవాలు కూడా ఇవే కానుండటం విశేషం. నవంబర్ 3న ప్రధాని పాల్గొననున్న దీపోత్సవ్ మెగా ఈవెంట్‌ను కోసం అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 7.5 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా గిన్నెస్ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
”ప్రధాని మోదీ మరోసారి అయోధ్యలో ఉండనుండటం మన అదృష్టం. దీపోత్సవ్ సెట్‌ను ప్రముఖ బాలీవుడ్ కళా దర్శకుడు నితిన్ చంద్రకాంత్ దేశర్ రూపొందించనున్నారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాం. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుంది” అని అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ ఉపాధ్యక్షుడు విశాల్ సింగ్ తెలిపారు.
భవ్య రామాలయ నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో ఆగస్టు 29న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం పర్యటించారు. రాముడు లేకుండా అయోధ్య లేదని, అయోధ్య ఎక్కుడుంటే రాముడు అక్కడే ఉంటాడని రామాయణ్ కాంక్లేవ్ ప్రారంభోత్సవం సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2017 నుంచి సరయూ నదీ తీరాన దీపోత్సవం నిర్వహిస్తూ వస్తోంది. దీపోత్సవంలో దాదాపు 7వేల మంది వలంటీర్లు పాల్గొంటారని అయోధ్య పరిపాలన తెలిపింది. ఇందులో ఎక్కువ మందిని వలంటీర్లుగా అయోధ్యలోని రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ విద్యార్థులను తీసుకుంటున్నట్లు జిల్లా పరిపాలన తెలిపింది.
కార్యక్రమానికి ముందు సజావుగా సాగేందుకు అయోధ్య అడ్మినిస్ట్రేషన్ మూడుసార్లు ట్రయల్ రన్ నిర్వహించనుంది. దీపాలను వెలిగించడంతో లేజర్ షోను సైతం నిర్వహించనున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు బృందం దీపోత్సవానికి హాజరవుతుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది 7.5 లక్షల దీపాలు వెలిగించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధిస్తామని బీజేపీ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా తెలిపారు. ఈ మేరకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో రికార్డు స్థాయిలో స్థాయిలో 4,10,000 దీపాలు వెలిగించారు. 2020లో సరయూ నది వెంట ఉన్న రామ్‌కీ పైరి ఘాట్ వద్ద 6,06,569 దివ్వెలు వెలిగించి రికార్డు సృష్టించారు. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉత్సవాలకు స్థానికులను మాత్రమే అనుమతి ఇచ్చారు.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు