యుపి బిజెపి ఎన్నికల ఇన్‌చార్జిగా ధర్మేంద్ర ప్రధాన్

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిలను బుధవారం నియమించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర సింగ్‌ ఫడ్నవీస్‌ను గోవా ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించారు. అలాగే కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, ఎంపీ దర్శన జర్దోష్‌ కో ఇన్‌చార్జిలుగా నియామకమయ్యారు. 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉత్తరప్రదేశ్‌, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉత్తరాఖండ్‌కు, పంజాబ్‌కు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను, కేంద్రమంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరీ, మీనాక్షి లేఖిని కో ఇన్‌చార్జిలుగా నియమించారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు మణిపూర్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 

కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, అసోం మంత్రి అశోక్ సింఘాల్‌కు కో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాషాయ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నది.

ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా

కాగా,  ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలం పూర్తి కావడానికి రెండేండ్ల ముందుగానే బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఆగ్రా నుండి పోటీ చేయడం కోసమే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసిన్నట్లు భావిస్తున్నారు. 

1956లో జన్మించిన బేబీ రాణి మౌర్య, 2018 ఆగస్టులో ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాఖండ్‌ తొలి మహిళా గవర్నర్ మార్గరెట్ అల్వా తర్వాత ఆ రాష్ట్రానికి రెండో మహిళా గవర్నర్‌గా ఆమె వ్యవహరించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బేబీ రాణి మౌర్య, ఉత్తరాఖండ్ గవర్నర్ కావడానికి ముందు అనేక రాజకీయ, పరిపాలనా పదవులలో పనిచేశారు. 1995 నుండి 2000 వరకు ఆగ్రా మేయర్‌గా ఉన్నారు. 2001లో యూపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలుగా, 2002లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా పని చేశారు. 1996లో ఆమెకు సమాజ్ రత్న, 1997లో ఉత్తర ప్రదేశ్ రత్న, 1998లో నారి రత్న అవార్డులు లభించాయి