రాహుల్‌గాంధీ ఓ కుహ‌నా నిపుణుడు

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాహుల్‌గాంధీ ద‌గ్గ‌ర‌ డాంబికం పొంగి పొర్లుతున్న‌ద‌ని, ఆయ‌న‌ తనకు లేని గుర్తింపును కోరుకుంటారని, ఆయన ఒక‌ కుహనా నిపుణుడని ధర్మేంద్ర ప్రధాన్ ఎద్దేవా చేశారు. 

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ – నీట్‌ నిర్వహణను వాయిదా వేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేయడంపై విద్యాశాఖ మంత్రి పై విధంగా స్పందించారు. నీట్ షెడ్యూలుపై నిపుణులను, సుప్రీంకోర్టును తప్పుప‌ట్టినందుకు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి మండిప‌డ్డారు.

”యువరాజు” తనకు అర్థంకాని విషయాలపై ప్రకటనలు ఇవ్వడం కన్నా, అబద్ధాలు సృష్టించడంలో తనకుగల నైపుణ్యానికి అంటిపెట్టుకుని ఉంటే మంచిద‌ని కేంద్ర మంత్రి హితవు చెప్పారు.

సెప్టెంబర్‌లో అనేక పరీక్షలు జరుగుతున్నాయని, కాబ‌ట్టి నీట్ పరీక్షను వాయిదా వేయాలని రాహుల్ గాంధీ కోరారు. అన్ని ప‌రీక్ష‌లు ఒకేసారి ఉండ‌టంవ‌ల్ల విద్యార్థుల‌పై ఒత్తిడిని ప‌ట్టించుకోకుండా కేంద్ర స‌ర్కారు గుడ్డిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.

ఇదిలావుండగా, నీట్ పరీక్షను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీని సెప్టెంబరు 12న నిర్వహిస్తారు.