ఆఫ్ఘన్ పరిణామాలపై ఢిల్లీలో అమెరికా, రష్యా నిఘా అధికారులు

అఫ్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఎదురయ్యే పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యా అత్యున్నత నిఘా అధికారులు ఒకేసారి  ఢిల్లీ రావడం ప్రాధాన్యత సంతరింప చేసుకకొంది. వారితో జాతీయ భద్రతామండలి సలహాదారు అజిత్‌దోవల్ చర్చలు జరిపారు. 

అమెరికా నిఘా విభాగం సిఐఎ చీఫ్ విలియం బర్న్‌,  రష్యా ఇంటెలిజెన్స్ చీఫ్ నికోలాయ్ పత్రుషేవ్‌ లతో దోవల్ చర్చించారు. ఈ చర్చల్లో ఇరు దేశాల నిఘా అధికారులు పాల్గొన్నారు. భారత్, రష్యాతోపాటు మధ్య ఆసియా ప్రాంతాల్లో చురుగ్గా ఉన్న జైషే మహ్మద్, లష్కర్‌ఇతోయిబాలకు తాలిబన్లు ఆశ్రయమిస్తే ఎదురయ్యే పరిస్థితులపై రష్యా ఇంటెలిజెన్స్ చీఫ్‌తో దోవల్ చర్చించినట్టు తెలుస్తోంది. రష్యాను దీర్ఘకాలిక మిత్రదేశంగా భారత్ భావిస్తుందన్నది తెలిసిందే.

ఈ ప్రాంతంలో ఉగ్రసంస్థలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు ఉగ్రదాడులకు పాల్పడకుండా ఉమ్మడిగా ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై ఇరు దేశాల నిఘా అధికారుల మధ్య చర్చలు సాగినట్టు తెలుస్తోంది. అఫ్ఘన్ పరిణామాలపై ఇప్పటికే ప్రధాని మోడీ,రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఆగస్టు 24న ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికాతో జరిగిన చర్చలు అఫ్ఘన్ నుంచి ఎదురుకానున్న భద్రతా సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై సాగినట్టు తెలుస్తోంది. 

 ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యన్‌ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ నికోలాయ్‌ పాత్రుషేవ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుత సమయంలో అఫ్గాన్‌తో సహా ప్రాంతీయ సుస్థిరత దిశగా  మరింత సమన్వయాన్ని బలోపోతం చేయాలంటూ పునరుద్ఘాటించారు. భారత్‌ -రష్యాల మధ్య భాగస్వామ్య అభివృద్ధి, రాజకీయాలు, బహుళ ఫార్మేట్స్‌, ఎస్‌సీఓ, బ్రిక్స్‌ తదితర విషయాలపై  సంభాషించారు.

అయితే, ఈ చర్చలపై వ్యాఖ్యానించేందుకు అమెరికా రాయబార కార్యాలయం నిరాకరించింది. అఫ్ఘన్‌లోని సైనిక, రాజకీయ, సామాజిక,ఆర్థిక పరిస్థితులపై తమ మధ్య అభిప్రాయాల మార్పిడి జరిగినట్టు రష్యా అధికారిక వర్గాలు తెలిపాయి. మారిన పరిస్థితుల్లో అఫ్ఘన్ నుంచి వలస వచ్చే శరణార్థుల సమస్యలపైనా చర్చించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

అంతకు ముందు బ్రిటన్ నిఘా అధిపతి రిచర్డ్ మూర్ కూడా ఢిల్లీ సందర్శించారు. ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన కారణంగా ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా పెరుగనున్న ఉగ్రవాద ప్రమాదాల గురించి ఈ సమాలోచనలలో  ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పాకిస్థాన్ నుండి కాశ్మీర్ లోయలోకి చొరబాటుదారులను ఎక్కువగా పంపే ప్రయత్నం జరుగవచ్చని భారత్ ఆందోళన చెందుతున్నది.