మమతాపై బీజేపీ అభ్య‌ర్థిగా ప్రియాంకా తిబ్రేవ‌ల్!

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈనెల 30వ తేదీన జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో భ‌వానిపుర్ నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా అడ్వ‌కేట్ ప్రియాంకా తిబ్రేవ‌ల్ పోటీ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌తంలో బాబుల్ సుప్రియోకు లీగ‌ల్ అడ్వైజ‌ర్‌గా ప‌నిచేశారామె. 

2014లో బీజేపీలో చేరింది. 2015లో కోల్‌క‌తా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్రియాంకా 58వ వార్డు నుంచి పోటీ చేసి తృణ‌మూల్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆరేళ్లుగా బీజేపీలో ఉంటున్న ఆమె పార్టీలో కీల‌క హోదాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం బెంగాల్ బీజేవైఎం ఉపాధ్య‌క్షురాలిగా ఉన్నారు.

2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె ఎంట‌ల్లి నుంచి పోటీ చేసి టీఎంసీ నేత స్వ‌ర్ణ‌క‌మ‌ల్ సాహా చేతిలో ఓడిపోయారు. ప్రియాంకా తిబ్రేవ‌ల్ 1980, జూలై 7న కోల్‌క‌తాలో జన్మించారు. వెల్లాండ్ గౌల్డ్‌స్మిత్ స్కూలో ప్రాథ‌మిక విద్యన‌భ్య‌సించారు. ఢిల్లీ వ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. హ‌జ్రా లా కాలేజీ నుంచి న్యాయ ప‌ట్టాను పొందారు.

థాయిలాండ్ వ‌ర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. భ‌వానిపుర్ నుంచి పోటీ చేస్తావా అని పార్టీ నేత‌లు తనను సంప్ర‌దించార‌ని, కానీ తుది వ‌ర‌కు అభ్య‌ర్థి ఎవ‌రో తెలియ‌ద‌ని ఆమె తెలిపారు. మ‌మ‌తా బెన‌ర్జీ కేవ‌లం అధికారం కోసం భ‌వానిపుర్ నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ఆమె ఆరోపించారు. మమతా ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.