కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎం

కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలాగా మారిందని కేంద్ర విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్‌ ధ్వజమెత్తారు. హుజురాబాద్ లో  ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ 40వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రూ 1.30లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. 
 
ఇందులో కేసీఆర్‌ కుటుంబానికి కమిషన్లు అందాయని కేంద్ర మంత్రి  ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కేసీఆర్‌ మీద అనేక ఆశలు పెట్టుకున్నారని, వాటిని పూర్తి చేయడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, ప్రతి పౌరుడికి డబుల్‌ బెడ్‌రూం ఏమైందని ప్రశ్నించారు. 
 
ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్‌కి ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సచివాలయానికి రారని, ఇక్కడ కుటుంబ పాలన నడుస్తోందని దయ్యబట్టారు. 1400 మంది విద్యార్థులు ప్రాణాలర్పించింది కేసీఆర్‌ కుటుంబం కోసం కాదని మురళీధరన్‌ స్పష్టం చేశారు. 
 
నిజాం పాలన నుండి బయటపడిన సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినంగా అధికారికంగా జరుపుతామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక ఒవైసీకి భయపడి చేయడం లేదని దుయ్యబట్టారు. ఇక తెలంగాణాలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన తరగతులకు ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. 
 
అయితే బిసి వర్గాలు అభివృద్ధిలోకి రావడానికి కేసీఆర్ దయాదాక్షిణ్యాలు అవసరం లేదని మురళీధరన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం సమాన హక్కులు అందాల్సి ఉన్నదని చెప్పారు. 
 
కేసీఆర్ ద్వంద్వ నీతికి నిదర్శనం 
 
కరోనా సాకుతో హుజురాబాద్‌ ఉపఎన్నికలను వాయిదా వేయించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్‌ఎస్‌ నేతలు ఉపఎన్నికను వాయిదా వేయించారని ఎద్దేవా చేశారు. 
 
కార్పొరేట్‌ స్కూళ్లు ఒక్కో విద్యార్థి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి టీఆర్‌ఎస్‌ నేతలకు కమీషన్లు ఇచ్చాయని ఆరోపించారు. ఫీజులు వసూలు చేసిన తరువాత కార్పోరేట్‌ విద్యా సంస్థలు కరోనా సాకుతో స్కూళ్లను మూసేసిన విషయాన్ని సంజయ్‌ గుర్తు చేశారు.