100 కి.మీల పాదయాత్ర పూర్తి చేసిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్  చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం మధ్యాహ్నం 100 కి.మీల మైలురాయిని దాటింది. ఈనెల 28న పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభించిన పాదయాత్ర 9 రోజులుగా వానొచ్చినా, వరదలొచ్చినా…ఇబ్బందులెదురైనా ఆగకుండా నిర్విరామంగా కొనసాగుతోంది.
 
పాతబస్తీ మొదలు గోషామహల్, నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పాదయాత్రను పూర్తి చేసిన బండి సంజయ్ ప్రస్తుతం వికారాబాద్ నియోజకవర్గంలో యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు సగటున 12 కి.మీల చొప్పున కాలినడకన గ్రామాల్లో పర్యటిస్తున్న బండి సంజయ్ తనకు ఎదురైన ప్రజలతో మమేకమవుతున్నారు. 
 
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చి సంతృప్తి పరుస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో బండి సంజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువకులు, పిల్లలు, మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా జనం సంజయ్ ను కలిసేందుకు, ఆయనతో సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. 
 
ఈ పాదయాత్రలో ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, పంట నష్ట పరిహారం అందకపోవడం, రైతు బీమా దరఖాస్తులో జాప్యం, పంట ఉత్పత్తికి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ సౌలభ్యం లేకపోవడం, కౌలు రైతులకూ రైతు బంధు వర్తింపజేయాలనే అంశాలు సంజయ్ దృష్టికొచ్చాయి.

బండి సంజయ్ పాదయాత్రలో నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ, ఉపాధి లేక యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఎక్కువ వినతి పత్రాలు వచ్చాయి. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయించాలని, నిరుద్యోగ భ్రుతి ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని యువత పెద్ద ఎత్తున సంజయ్ ను కలిసి కోరుతోంది.


కరోనాతో వేలాది కుటుంబాలు చితికిపోయిన అంశం కూడా సంజయ్ దృష్టికి వచ్చింది. అదే సమయంలో తమకు ఇండ్లు లేవని, డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదంటూ పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్నాయి. 
 
అదే సమయంలో ప్రభుత్వంపై పోరాడాలని తాము అండగా ఉంటామని సంజయ్ కు జనం మద్దతు పలుకుతూ ఒకవైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే వాటి పరిష్కారమే ఎజెండాగా ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చే దిశగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు.

బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీలో రాష్ట్రవ్యాప్తంగా ఊహించని జోష్ కనబడుతోంది. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ఆరంభ సభకు కనీవినీ ఎరగని రీతిలో జనం తరలిరావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశమైంది. ప్రతిరోజు సగటున 500 మందికి తక్కువ కాకుండా బీజేపీ సంగ్రామ సైనికులు సంజయ్ వెంట నడుస్తున్నారు.