టోక్యో పారాలింపిక్స్‌ లో భారత్ సరికొత్త చరిత్ర

జ‌పాన్ రాజ‌ధాని టోక్యో లో జరిగిన oly    ఒలింపిక్స్ లో మ‌న అథ్లెట్లు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించి, 7 పతకాలు సాధించి లండన్ ఒలింపిక్స్ (6 పతకాలు) రికార్డును బద్దలు చేశారు. తాజాగా ముగిసిన పారాలింపిక్స్‌ లో సహితం 19 పతకాలు గెలిచి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతిభను కనబరిచారు.  

చివ‌రి రోజు బ్యాడ్మింట‌న్‌లో ఓ స్వర్ణం, మరో  సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించారు. భారత్ ఇప్పటి వరకు ఒక పారాలింపిక్స్‌లో సాధించిన అత్య‌ధిక మెడ‌ల్స్ 12 మాత్ర‌మే కావడం గమనార్హం. ఇప్పుడు అంత‌కంటే చాలా ఎక్కువ మెడ‌ల్స్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇందులో ఐదు స్వర్ణ పతకాలు కూడా ఉన్నాయి.

ఈసారి కూడా మ‌న పారా అథ్లెట్లు అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగా రెండంకెల మెడ‌ల్స్ తీసుకొస్తార‌ని ముందే ఊహించినా.. ఈ స్థాయి ప్ర‌ద‌ర్శన మాత్రం అందరికి ఆశ్చ‌ర్యం కలిగించింది.భారత్ సాధించిన మొత్తం 19 మెడ‌ల్స్‌లో  5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ మెడల్స్‌లోనూ మ‌న‌వాళ్లు కొన్ని కొత్త రికార్డులు సృష్టించారు. భారత్ ఈసారి పారాలింపిక్స్‌కు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా 54 మంది పారా అథ్లెట్లును పంపించింది. వీళ్లు 9 క్రీడ‌ల్లో పాల్గొన్నారు. తొలిసారి బ్యాడ్మింటన్‌, తైక్వాండో టోక్యో పారాలింపిక్స్‌లో ఎంట్రీ ఇచ్చాయి.

పారాలింపిక్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి గోల్డెన్ షూటర్ అవని లేఖర ప్రాతినిధ్యం వహించింది. త్రివర్ణ పతాకం చేతబూనిన అవని లేఖర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 1968లో తొలిసారి పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత్  2016 రియో పారాలింపిక్స్‌లో 12 మెడ‌ల్స్ సాధించింది. ఆ రికార్డును ఇప్పుడు అధిగ‌మించింది. మొత్తం 162 దేశాలు పాల్గొన్న ఈ గేమ్స్‌లో 19 మెడ‌ల్స్‌తో భారత్ 24వ స్థానంలో నిలిచింది.

షూటింగ్‌లో అవ‌ని లెఖారా ఈసారి ఇండియా త‌ర‌ఫున తొలి స్వర్ణం  సాధించింది. 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్‌లో ఆమె తొలి స్థానంలో నిలిచింది. గ‌తంలో ఏ భార‌తీయ మ‌హిళా పారాఅథ్లెట్ కూడా స్వర్ణం  సాధించ‌లేదు. ఇదే ఓ అద్భుత‌మైన రికార్డు అనుకుంటే.. 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్‌లో బ్రాంజ్ గెలిచి మ‌రో చ‌రిత్ర సృష్టించింది. భారత్ త‌ర‌ఫున ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన వ్య‌క్తి మ‌రొక‌రు లేరు.

ప్రధాని సంతోషం 

 భార‌తదేశ క్రీడ‌ల చ‌రిత్ర‌లో టోక్యో పారాలింపిక్స్‌  ఎప్పటికీ ప్ర‌త్యేకమైన‌విగా నిలిచిపోతాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంతోషం వ్య‌క్తంచేశారు. ప్ర‌తి భార‌తీయుడి జ్ఞాప‌కాల్లో ఈ పారాలింపిక్స్ చెర‌గ‌ని ముద్రగా మిగిలిపోతాయ‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. భావి త‌రాల్లో చాలా మంది క్రీడ‌ల‌వైపు ఆక‌ర్షితుల‌య్యేందుకు ఈ పారాలింపిక్స్ దోహదం చేస్తాయ‌ని చెప్పారు. 

పారాలింపిక్స్‌కు వెళ్లిన భార‌త బృందంలోని ప్ర‌తి స‌భ్యుడు ఒక చాంపియ‌న్ అని, భావి త‌రాల్లో ప్రేర‌ణ క‌ల్పించే ఒక వ‌న‌రు అని ఆయ‌న‌ కొనియాడారు.  చరిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా ఒకే పారాలింపిక్స్‌లో మ‌న పారాలింపియ‌న్‌లు 19 ప‌త‌కాలు గెలిచి మనంద‌రి హృద‌యాల‌ను ప‌ర‌వ‌శింప‌జేశార‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.

ఈ విజ‌యానికి దోహ‌ద‌ప‌డిన‌ కోచ్‌లు, స‌పోర్ట్ స్టాఫ్‌తోపాటు క్రీడాకారుల కుటుంబాల‌ను ప్ర‌ధాని మెచ్చుకున్నారు. ఈ విజ‌యం భ‌విష్య‌త్తులో క్రీడ‌ల్లో భాగ‌స్వామ్యం పెరుగడానికి దోహ‌దం చేస్తుంద‌ని ఆశిద్దామ‌ని పేర్కొన్నారు. అదేవిధంగా విజ‌య‌వంతంగా ఒలింపిక్స్‌, పారాలింపిక్స్ నిర్వ‌హించిన జపాన్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

సరికొత్త రికార్డులు 

  • సుమిత్ అంటిల్ – ఎఫ్‌64 మెన్స్ జావెలిన్‌లో ప్ర‌పంచ రికార్డు (గోల్డ్ మెడ‌ల్‌)
  • అవ‌ని లెఖారా – ఆర్‌2 వుమెన్స్ 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌1లో ప్ర‌పంచ రికార్డు స‌మం. కొత్త పారాలింపిక్ రికార్డు (గోల్డ్‌)
  • మ‌నీష్ న‌ర్వాల్ – పీ4 మిక్స్‌డ్ 50 మీట‌ర్ల పిస్ట‌ల్ ఎస్‌హెచ్‌1 పారాలింపిక్ రికార్డు (గోల్డ్‌)
  • నిషాద్ కుమార్ – మెన్స్ టీ47 హైజంప్‌లో ఏషియ‌న్ రికార్డు (సిల్వ‌ర్‌)
  • ప్ర‌వీణ్ కుమార్ – మెన్స్ హైజంప్ టీ64లో ఏషియ‌న్ రికార్డు (సిల్వ‌ర్‌)
పతకాలు సాధించింది వీరే 
 

స్వర్ణ పతాకం  సాధించిన వాళ్ల‌లో. అవ‌ని లెఖారా (షూటింగ్‌), ప్ర‌మోద్ భ‌గ‌త్ (బ్యాడ్మింట‌న్‌), కృష్ణ న‌గార్ (బ్యాడ్మింట‌న్‌), సుమిత్ అంటిల్ (జావెలిన్ త్రో), మ‌నీష్ న‌ర్వాల్ (షూటింగ్‌).

కాంస్య పతాకం  సాధించిన వాళ్లలో.. భ‌వీనాబెన్ ప‌టేల్ (టేబుల్ టెన్నిస్‌), సింఘ్‌రాజ్ (షూటింగ్‌), యోగేశ్ క‌థూనియా (డిస్క‌స్ త్రో), నిషాద్ కుమార్ (హైజంప్‌), మ‌రియ‌ప్ప‌న్ తంగ‌వేలు (హైజంప్‌), ప్ర‌వీణ్‌కుమార్ (హైజంప్‌), దేవేంద్ర ఝ‌ఝారియా (జావెలిన్ త్రో), సుహాస్ య‌తిరాజ్ (బ్యాడ్మింట‌న్‌).

రజత పతాకం గెలిచిన వాళ్ల‌లో.. అవని లెఖారా (షూటింగ్‌), హ‌ర్వింద‌ర్ సింగ్ (ఆర్చ‌రీ), శ‌ర‌ద్‌కుమార్ (హైజంప్‌), సుంద్ సింగ్ గుర్జార్ (జావెలిన్ త్రో), మ‌నోజ్ స‌ర్కార్ (బ్యాడ్మింట‌న్‌), సింఘ్‌రాజ్ (షూటింగ్‌).

ఈసారి అత్య‌ధికంగా అథ్లెటిక్స్‌లో 8 మెడ‌ల్స్ రాగా.. షూటింగ్‌లో 5, బ్యాడ్మింట‌న్‌లో 4, ఆర్చ‌రీ, టేబుల్ టెన్నిస్‌ల‌లో ఒక్కో మెడ‌ల్ వ‌చ్చింది. ఆర్చ‌రీ, టేబుల్ టెన్నిస్‌ల‌లో ఇండియా మెడ‌ల్స్ గెల‌వ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.