హింస, మాఫియా నుండి అభివృద్ధి పథంలో యుపి

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం వారణాసిలో జరిగిన ‘ప్రబుద్ధ సమ్మేళన్’ సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని హింస, మాఫియా, అరాచక పాలన నుండి అభివృద్ధి పధం వైపు తన ప్రభుత్వం ఏ విధంగా తీసుకెడుతున్నదో వివరించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో  రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ప్రబుద్ధ సమ్మేళన్’ (మేధావుల సమావేశం)లను 18 నగరాల్లో జరపాలని బీజేపీకి నిర్ణయించింది. 
 
రాష్ట్రం మాఫియా, దోమ, చెత్తను వదిలించుకుంటోందని, అభివృద్ధికి కొత్త కథను రచించిందని ఆదిత్యనాథ్ తెలిపారు.
“ఒకప్పుడు తూర్పు ఉత్తర ప్రదేశ్ మాఫియా కేంద్రంగా ఉండేది.  మలేరియా, ఎన్సెఫాలిటిస్, డెంగ్యూ కేసులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండెడివి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి” అని ఆయన చెప్పారు.

కాన్పూర్‌లో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అయోధ్యలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, లక్నో లో రాష్ట్ర సంఘటన కార్యదర్శి సునీల్ బన్సల్ ల ఆధ్వర్యంలో కూడా ఇటువంటి సమ్మేళనాలు జరిగాయి.  మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1966 లో పార్లమెంట్ వద్ద సమావేశమైన సాధువులపై కాల్పులు జరపాలని ఆదేశించగా, 1990 లో అయోధ్యలో రాముడి భక్తులపై కాల్పులకు సమాజ్ వాదీ పార్టీ  ప్రభుత్వం ఆదేశించిందని స్వతంత్రదేవ్ సింగ్ గుర్తు చేశారు.


“ఈ బుల్లెట్లు భారతదేశ సంస్కృతి, జాతీయవాదం యొక్క సిద్ధాంతంపై కాల్చబడ్డాయి. మొత్తం భారతదేశం రాముడిపై తన విశ్వాసాన్ని తిరిగి పొందుతుంది. ఈ ప్రదేశంలోని ప్రతి అణువులోనూ రాముడు నివసిస్తున్నాడు” అని స్పష్టం చేశారు. 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి ఉనికిని నిరాకరించిందని ఆరోపించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రామసేతుని అంగీకరించలేదని, హిందూ భీభత్సం వంటి పదాలు రూపొందించారని ధ్వజమెత్తారు. 

అదే సమయంలో, బిజెపి మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇందు బాల గోస్వామి సంస్థను బలోపేతం చేయడంలో మహిళలు క్రియాశీల భూమిక వహించాలని పిలుపిచ్చారు. “మనం పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.  రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి” అని ఆమె చెప్పారు.

ఇలా ఉండగా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ లోని వారసత్వ ప్రదేశాలను కేంద్రం ‘స్వదేశన్ దర్శన్ స్కీమ్’ పరిధిలోకి తీసుకొచ్చి, అభివృద్ధి చేసే చర్యలను చేపట్టింది. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కబీర్, మహావీర్ జైన్‌ లకు సంబంధించిన రాష్ట్రంలోని వారసత్వ ప్రదేశాలను ఈ పధకం పరిధిలోకి తీసుకొచ్చారు. 

 
ఈ ప్రదేశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యటికులను ఆకర్షించడం, వారి భద్రతకు హామీ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ .33.17 కోట్లు కేటాయించింది. పునర్నిర్మించబడే ప్రదేశాలలో బండా జిల్లాలోని కలింజర్ కోట ఉంది, ఇది దాదాపు 1500 సంవత్సరాల పురాతనమైనది. పైగా, దేశంలోనే అతిపెద్ద కోటలలో ఒకటి.

మాజీ గవర్నర్ పై దేశ ద్రోహం కేసు 

యోగి ఆదిత్యనాథ్  ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. యుపి పోలీసుల ప్రకారం, రాంపూర్ జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో బిజెపి కార్యకర్త ఆకాష్ సక్సేనా ఫిర్యాదుపై ఖురేషీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

రాంపూర్ ఎమ్మెల్యే, ఖాన్ భార్య తన్జీమ్ ఫాతిమాను కలిసేందుకు ఖురేషి ఆజామ్ ఖాన్ ఇంటికి వెళ్లారని, అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని “దెయ్యం, రక్తం పీల్చే రాక్షసులతో పోల్చినట్లు” సక్సేనా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.

 
కాగా, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మనోజ్ పాండేపై ప్రధాని నరేంద్ర మోదీపై కించపరిచే పదాలు ఉపయోగించినందుకు కేసు నమోదు చేశారు. దిలీప్ కుమార్ అనే ఉత్తర ప్రదేశ్ నివాసి రాయబరేలిలోని ఉంచహర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. 
 
జిల్లాలోని శివగఢ్ పోలీస్ స్టేషన్ ప్రాంత నివాసి, సోషల్ మీడియాలో వైరల్ అయిన పాండే చెప్పిన మాటల వీడియోను చూసిన తర్వాత తీవ్ర చర్య తీసుకున్నాడు. జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో, ఉంచహార్ ఎమ్మెల్యే రాజ్యాంగ పదవులను ఆక్రమించిన ప్రధాన మంత్రి, ఇతర ప్రముఖులను”దుర్భాష” లాడినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు.