
పంజ్‌షీర్‌లో తాలిబన్ల దాడులను నిరోధించేలా చూడాలని ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు, ఆపద్ధర్మ అధ్యక్షునిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఐక్యరాజ్యసమితిని కోరారు. పంజ్‌షీర్‌లో తాలిబన్ల దుశ్చర్యల కారణంగా పెద్ద ఎత్తున మానవతావాద సంక్షోభం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు అమ్రుల్లా ఐక్య రాజ్య సమితికి, అంతర్జాతీయ సమాజానికి లేఖ రాశారు. పంజ్‌షీర్‌లో పరిస్థితి భయంకరంగా ఉందని, పంజ్‌షీర్ ప్రావిన్స్‌తో పాటు బాగ్లాన్ ప్రావిన్స్‌లోని మూడు ఆండ్రాబ్స్ జిల్లాల్లో పెద్ద ఎత్తున మానవ సంక్షోభం ఏర్పడుతోందని చెప్పారు.
ఈ ప్రాంతంలో తాలిబన్ల దాడిని నిరోధించేందుకు, వేలాది మంది స్థానికులను, శరణార్థులను రక్షించడానికి రాజకీయ పరిష్కారం కోసం చర్చలను ప్రోత్సహించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. సుమారు 2,50,000 మంది నిరాశ్రయులయ్యారని, వీరిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారని తెలిపారు.
కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న అనంతరం ఇతర ప్రాంతాల నుండి సుమారు పదివేలమంది పంజ్‌షీర్ ప్రాంతానికి చేరుకున్నారని , వీరంతా మసీదులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని చెప్పారు. ఆకలి, నీరు, పోషకాహార లోపంతో వీరు జీవించడం కోసం అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
వారికి అత్యవసరంగా ఆహారం, ఆశ్రయం, నీరు, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణలతో పాటు ఆహారేతర అంశాలు అవసరమని అంతర్జాతీయ సంఘం, ఐరాస, ఎన్‌జిఒలకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితిని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టకపోతే పూర్తిస్థాయిలో మానవహక్కులు, ఆకలి, సామూహిక హత్యలతో పాటు మారణ హోమం జరుగుతుందని స్పష్టం చేశారు.
వారికి తక్షణమే ప్రాథమిక ఉపశమనం అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. తాలిబన్లు, విదేశీ సమూహాలు పంజ్‌షీర్, ఉత్తర ఆఫ్ఘన్‌లోని పలు ప్రాంతాలపై దాడులను ప్రారంభించాయని చెప్పారు.
కాగా, తాలిబన్లపై పోరాడుతున్న చిట్ట చివరి ప్రావిన్స్ ఇదే. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు తాలిబన్లు పోరాడుతున్నాయి. ప్రముఖ ఆఫ్ఘన్ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్, అమ్రుల్లా సలేహ్ తాలిబన్లపై పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ దళాలకు నేతృత్వం వహిస్తున్నారు.
ఆఫ్ఘన్ లో ఎన్నికలకు ఇరాన్ పిలుపు
తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలని ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పిలుపునిచ్చారు. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పరిస్థితి ప్రశ్నార్థకంగా కనిపిస్తోందని, దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు, ప్రజలకు స్పష్టత కోసం ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో గందరగోళం, అస్తవ్యస్త పరిస్థితులు ఎప్పటిలోగా చక్కబడతాయో అర్థం కావడం లేదని, అస్తవ్యస్థ పరిస్థితులు చక్కబడాలంటే ఎన్నికలే సరైన మార్గమని ఆయన తెలిపారు. ఆప్ఘనిస్తాన్ ప్రజలకు తమ సొంత ప్రభుత్వాన్ని నిర్ణయించుకునే అవకాశం, హక్కు ఉండాలని పేర్కొన్నారు.
ప్రజల అభీష్టం మేరకు ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెబుతూ ఆఫ్ఘన్ లో ప్రజల శాంతి భద్రతలకు ఇరాన్ దేశం ప్రాధా న్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే ఇరాన్ దేశం మద్దతిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత అందర్నీ క్షమించేశామని, ఎవరినీ శిక్షించబోమని చెప్పారని, మరీ ముఖ్యంగా మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలిగించమని చెప్పి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి