గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత వైద్య వసతులు

దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టిసారించాలని కోరారు. మన దేశంలో వైద్య వసతులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి మరోసారి గుర్తుచేసిందని ఆయన పేర్కొన్నారు. 

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అక్రిడిటేడ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఏఎన్‌బీఏఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘11వ వార్షిక వైద్య అధ్యాపకులకు అవార్డుల’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటూ  వైద్య కళాశాలల సంఖ్యను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. వైద్యులు, రోగుల నిష్పత్తిలోని అంతరం మన దేశంలో ఎక్కువగా ఉన్నదన్న విషయాన్ని ప్రస్తావించారు.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక వైద్యుడు (1:1000) ఉండాలని కానీ భారతదేశంలో ఈ సంఖ్య 1:1,456 గా ఉందన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు కనీసం ప్రతి జిల్లా కేంద్రానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలనే సంకల్పంతో  కేంద్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నంచేస్తోందని పేర్కొన్నారు. ఈ దిశగా వైద్యరంగంలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమవంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. 

చాలా మంది వైద్యులు గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణ ప్రాంతాల్లో పనిచేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వైద్య విద్యతోపాటు వైద్యం కూడా సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం కూడా ఈ రంగంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. 

వ్యాధుల నిర్ధారణ, చికిత్స విషయంలో అధునాతన సాంకేతికత, సరికొత్త పరికరాల వినియోగాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కరోనా మహమ్మారి కూడా వైద్యులు, శాస్త్రవేత్తలు మొదలుకుని సమాజంలోని ప్రతి ఒక్కరికీ సరికొత్త పాఠాలను బోధించిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఉన్నతమైన విలువలతో కూడిన విద్యాబోధనను అందించేందుకు ఏఎన్‌బీఏఐ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు.