కేసీఆర్ ఫాంహౌజ్‎.. సంజయ్ మాత్రం రైతుల మధ్య

కేసీఆర్ ఫాంహౌజ్‎లో కూర్చొని మాట్లాడితే.. బండి సంజయ్ మాత్రం రైతుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డి పేటలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో ఫడ్నవీస్ పాల్గొంటూ సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తెలంగాణలో మార్పు తీసుకువస్తుందని చెప్పారు. 
 
 తెలంగాణలో కేసీఆర్‎కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైందని చెబుతూ కేసీఆర్ ఫాంహౌజ్‎లో కూర్చొని పథకాలను రచించి ఏ విధంగా దోపిడీ చేయాలో ప్రణాళిక రూపొందించి దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అనేక సబ్సిడీలను నిలిపేశారని మండిపడ్డారు. 
 
ధరణిని అమలు చేయడం లేదన్న ఫడ్నవీస్.. రుణమాఫీ పూర్తిగా ఇవ్వడంలేదని ధ్వజమెత్తారు. రైతుల ప్రభుత్వం, ప్రజాస్వామిక సర్కార్ రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపిచ్చారు. బండి సంజయ్ పాదయాత్రను ఆశీర్వదించాలని ఫడ్నవిస్ రాష్ట్ర ప్రజలను కోరారు. 

‘రైతులు పంటగిట్టుబాటకాక నష్టపోతుంటే.. కేసీఆర్ ఏమో ఎకరానికి కోటి సంపాదిస్తున్నడట. గంజాయి గిట్ల పండిస్తున్నడేమో’ అని  బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ‘మీ ఆశీర్వాదంతో రైతు, పేదల ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. 2023లో మీ ఆశీస్సులతో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. పేదల ప్రభుత్వాన్ని తీసుకొస్తం’ అంటూ భరోసా ఇచ్చారు.

ఈ రోజు డబుల్ బెడ్రూం, రుణమాఫీ, ఫ్రీ యూరియా అని కేసీఆర్ కోతలు కోస్తున్నడు. ఒక్కటి కూడా అమలు  చేయలేదు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి.. మిగిలిన అన్ని సబ్సిడీలు బంద్ చేసిండు. అద్బుతాలు సృష్టిస్తానన్నాడు. కానీ స్ప్రింకర్ల సబ్సిడీ, పాలీహౌజ్ సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ బంద్ చేసిండని సంజయ్ ధ్వజమెత్తారు.

చివరకు రుణమాఫీ చేస్తనన్నడు. బ్యాంకులో వేసుకున్న సొమ్మును కూడా బ్యాంకు వాళ్లు లాక్కుంటున్నారు. రైతులు హరిగోస పడుతున్నారు. కేసీఆర్‎కు వందలాది ఎకరాల ఫాంహౌజ్ ఉంది. ఆయన ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తుండట. మరి ఏం పండిస్తుండో.. ఆయన ఫాంహౌజ్‎లో సాయిల్ టెస్ట్ చేసుకుంటడు. దొడ్డు వడ్లు పండిస్తడు. కానీ రైతులు మాత్రం సన్న వడ్లు పండించాలని చెప్తడు అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

పండించిన పంటను మీ బావుల దగ్గరే కొని మీ ఇంటికే డబ్బులు పంపిస్తామని చెప్పిన కేసీఆర్ అవేమీ చేయలేదు. రైతులు ధాన్యం అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాలవద్ద పడిగాపులు పడి నానా గోస పడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం తెచ్చింది. కౌలు రైతు సహా ప్రతి రైతు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్త్తోంది. మరి కేసీఆర్ కౌలు రైతులకు ఎందుకు రైతుబంధును అమలు చేయడం లేదు?  అంటూ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ ప్రాంతంలో 1,30,895 మందికి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 244 కోట్ల రూపాయల నిధులిచ్చింది. విత్తనాల కోసం రూ. 4 కోట్లు, క్రిషి సంచాయి యోజన కింద మరికొన్ని కోట్లు ఇచ్చిందని సంజయ్ వెల్లడించారు.

`ధరణి పెద్ద స్కాం. ఎవరి పట్టా, ఎవరి స్థలం, ఎవరి పేరు మీద ఉందో అంతా గందరగోళం. ఓ పెద్దాయన ప్రాణహిత చేవెళ్ల డిజైన్ పేరిట కాల్వలు తవ్వి డబ్బులు దొబ్బుకుపోయిండు. ఈయన వచ్చి రీ డిజైన్ పేరు మీద అంచనాలు పెంచి కోట్లు దండుకున్నడు. ఈ ప్రాంతానికి నీళ్లు మాత్రం రాలేదు. అందరూ కలిసి ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టిండ్రు’ అని బండి సంజయ్ విమర్శించారు.