గిలానీ మృతదేహంపై పాక్ పతాకం… కాశ్మీర్ పోలీసుల కేసు 

జమ్మూ కాశ్మీర్ లో గత వారం మృతి చెందిన వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలాని మృతదేహంపై పాకిస్థాన్ జెండాను ఉంచినందుకు, ఖననం సందర్భంగా భారత వ్యతిరేక నినాదాలు ఇచ్చనందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉపా కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేశ వ్యతిరేక నినాదాలు ఇవ్వడం, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు బుద్గాం జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బుధవారం సాయంత్రం జిలానీ మరణించిన వెంటనే వేర్పాటువాద నాయకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, తాము  లేనప్పుడు రహస్యంగా ఖననం చేశారని కుటుంభం సభ్యులు చెబుతున్నారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడాన్నిమహిళలతో సహా కుటుంభం సభ్యులు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా జాతీయ వ్యతిరేక నినాదాలిచ్చారు.

గీలాని మరణవార్త వ్యాప్తి చెందడంతో, ప్రభుత్వం కర్ఫ్యూ లాంటి ఆంక్షలను విధించింది. ఇంటర్నెట్, ఫోన్ లైన్లను నిలిపి చేసింది. గీలాని మరణం తర్వాత సయ్యద్ అలీ షా గీలాని మృతదేహాన్ని పాకిస్థాన్ జెండాలో చుట్టినట్లు వీడియోలు కనిపించాయి.

కాశ్మీర్ అంతటా పరిస్థితి ప్రశాంతంగా ఉందని, డజన్ల కొద్దీ అల్లరి చేసేవార్లను ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నామని జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్పారు. బుద్గాంలోని నార్కారా ప్రాంతంలో ఒక చిన్న రాళ్లు రువ్విన ఘటన  తప్ప ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు.