ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై ఈడీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు. న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్‌ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌నీలాండ‌రింగ్ కేసులో నోటీసులిచ్చిన‌ ఈడీ అధికారులు హైద‌రాబాద్‌లోని కార్యాల‌యంలో ర‌కుల్‌ను ప‌లు అంశాల‌పై దాదాపు ఆరు గంట‌ల పాటు విచారించారు. ర‌కుల్ బ్యాంకు ఖాతాల వివ‌రాల‌ను అధికారులు ప‌రిశీలించారు.

అనంత‌రం బ్యాంకు ఖాతాల వివ‌రాలు, ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఎఫ్‌ క్లబ్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరా అయినట్లు కెల్వీన్‌ ఇచ్చిన సమాచారంతో ఈడీ రకుల్‌కు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్‌ సప్లై, ఎఫ్‌ క్లబ్‌ ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలపై ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

డ్రగ్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ ద‌ర్యాప్తు కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మిని ఈడీ అధికారులు విచారించారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ 12 మంది సెల‌బ్రిటీల‌కు నోటీసులు పంపిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం పూరీ జ‌గ‌న్నాథ్‌ని 10 గంట‌ల పాటు విచారించారు. ప‌లు కోణాల‌లో పూరీని విచారించిన‌ట్టు తెలుస్తుంది. ఇక గురువారం ఛార్మీని ఈడీ విచారించింది. ఆమెను 8 గంట‌ల పాటు ప్ర‌శ్నించ‌గా, అవ‌స‌ర‌మైతే మ‌రో సారి తాను విచార‌ణ‌కు హాజ‌రు అవుతాన‌ని పేర్కొంది.

గతేడాది బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ముంబై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) డ్రగ్స్‌ కేసు నమోదు చేసింది. అందులో రకుల్‌ పేరు వెలుగులోకి రావడంతోపాటు ఇక్కడి కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలిసింది.

గతేడాది సెప్టెంబర్‌ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్‌ హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రకుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ప్రధానంగా సుశాంత్‌సింగ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి (రియాను అప్పట్లో ఎన్సీబీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే)తో సంబంధాలపై ఆరా తీశారు. అప్పటి విచారణకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు ఎన్సీబీ నుంచి తీసుకున్నారు. వాటితోపాటు రెండు నెలల క్రితం కెల్విన్‌ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించారు.

శుక్రవారం ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైంది. చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదితో కలిసి రకుల్‌ ఈడీ ఆఫీసుకు చేరుకుంది. ఇక ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు మరికొందరు విచారణ ఎదుర్కోనున్నారు. దీంతో టాలీవుడ్ మరోసారి డ్రగ్స్ కేసు చుట్టూ తిరుగుతోంది. కాగా,  డ్రగ్ అనేది ఒక్క సెలెబ్రెటీ అంశం మాత్రమే కాదని, పొలిటికల్- బార్డర్- ఆర్థికపరమైన అంశం కూడా అని నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాలీవుడ్ డ్రగ్ కేసు అంశంపై త్వరలో మాట్లాడుతాను.. నా వ్యక్తిగత అనుభవం తెలియజేస్తాను’ అంటూ పూనమ్ కౌర్ తెలిపారు.