కెల్విన్ తో ఆర్ధిక లావాదేవీలపై చార్మీకి ప్రశ్నలు 

డ్రగ్స్‌ కేసుల్లో కీలక నిందితుడైన కెల్విన్‌ తో గల ఆర్ధిక లావాదేవీలపై  టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)  అధికారులు  సినీనటి, నిర్మాత చార్మి కౌర్ ను ప్రశ్నించారు. సుమారు 8 గంటలకు పైగా జరిగిన విచారణలో ప్రధానంగా  కెల్విన్‌కు పెద్దమొత్తంలో డబ్బులు ఎందుకు పంపారంటూ నిలదీశారు.
 
తన రెండు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలతోపాటు పూరికనెక్ట్స్‌, మరో సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలపై వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ముఖ్యంగా 2015-18 మధ్యకాలంలో ఆ నాలుగు ఖాతాల స్టేట్‌మెంట్లను ఆమె చార్టెట్‌ అకౌంటెట్‌ ఈడీ అధికారులకు సమర్పించారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం చార్మిని విచారించింది. అందులో ఇద్దరు మహిళా అధికారులున్నారు.
 
ప్రధానంగా కెల్విన్‌తో ఉన్నడ్రగ్స్ లింక్‌లపై ఆరా తీయడంతో పాటు కెల్విన్‌తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? కెల్విన్ కాంటాక్ట్ లిస్ట్‌లో మీ పేరు ఎందుకు ఉందని ఆరా తీశారు. కెల్విన్ డ్రగ్స్ దందాలో మీకు భాగస్వామ్యం ఉందా? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందని ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
కెల్విన్ కాంటాక్ట్ లిస్ట్ లో చార్మి పేరు దాదా పేరిట సేవ్ చేసి గుర్తించిన ఇడి అధికారులు దాదా పేరుతో ఉన్న ట్రాన్జాక్షన్స్‌పై ఆరా తీశారు. ఇందులో భాగంగా చార్మికి చెందిన రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించి 2013 నుంచి 2018 వరకు మూడేళ్ల పాటు జరిగిన బ్యాంక్ లావాదేవీలను ఇడి అధికారులు పరిశీలించారు.
 
అదేవిధంగా పూరీ జగన్నాథ్, చార్మి భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తున్నారని, వీరిద్దరి మధ్య డ్రగ్స్ లింక్‌లపై ఉన్న ఆధారాలపై కూడా ఇడి అధికారులు విచారణ చేపట్టారు. వీరిద్దరి మధ్య డ్రగ్స్ లింక్‌లు ఉన్నాయా? వీరితో పాటు ఇంకెవరైనా సహకరించారా? అనే విషయాలు రాబట్టారు. 
 
2017లో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విచారణ ఎదుర్కొన్న చార్మి ప్రశ్నించిన ప్రశ్నలకు భిన్నంగా ఇడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇడి నటి చార్మిని విచారించారు. నటి చార్మి. ఆమెతో తన సీఏ సతీష్ హాజరై బ్యాంకు ఖాతాలను సమర్పించారు.
 
అయితే, ఈడీ అధికారుల విచారణలో కెల్విన్‌ ఎవరో తనకు తెలియదని చార్మి చెప్పడం గమనార్హం! కెల్విన్‌ మొబైల్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో తన నంబర్‌ దాదా అని ఉందని, అతడితో ఆర్థిక లావాదేవీలపై వాట్సాప్‌ చాటింగ్‌లో పలుమార్లు చర్చించారని అధికారులు వివరించారు. వాట్సాప్‌ చాటింగ్‌, కాల్‌డేటా వివరాలను ఆమెకు చూపిస్తూ ప్రశ్నించారు. 
 
చార్మి ఆ ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లుగా తెలుస్తోంది. కెల్విన్‌తో పాటు మరో ముగ్గురి డ్రగ్‌ పెడ్లర్ల ఫొటోలను చార్మికి చూపించగా వారెవరో తనకు తెలియదని సమాధానమిచ్చారు.
 
కాగా,  ఇడి విచారణాంతరం చార్మి మీడియాతో మాట్లాడుతూ విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.‘ఈడీ అధికారుల నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యానని, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని పేర్కొన్నారు. అధికారుల దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తానని, విచారణలో భాగంగా అధికారులు అడిగిన బ్యాంక్ పత్రాలు సమర్పించినట్లు తెలిపారు.
నేడే రకుల్ విచారణ 
 
ఇలా  ఉండగా, ఇప్పటి వరకు నిందితుల పేర్లలో కనిపించని మరో సినీ నటి  రకుల్ ప్రీత్ సింగ్ ను నేడు విచారింపనున్నారు.  నిజానికి ఈనెల 6న విచారణకు హాజరుకావాలని ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు రకుల్‌ లేఖరాశారు.
ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. గతంలో సిట్‌ అధికారులు విచారించిన సినీ ప్రముఖల జాబితాలో రకుల్‌ పేరు లేదు. కెల్విన్‌కు ఆమె నగదు పంపించినట్లుగా ఈడీ ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల ప్రకారమే నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం.