కాంగ్రెస్ అజ్ఞానాన్ని వెల్లడిస్తున్న ఖడ్గే ప్రకటన! 

నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ ( ఎన్‌ఎమ్‌పి) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటన 55 ఏళ్లుగా ఈ దేశాన్ని పాలించే పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అజ్ఞానాన్ని, పాలనా దివాలాను ప్రదర్శిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావు విమర్శించారు.
 

ఎన్‌ఎమ్‌పిపై భారతదేశంలోని మేధావులు మౌనంగా ఉన్నారని అంటూ ఖర్గే ఫిర్యాదు చేయడం వారిని ప్రేరేపించే పిల్లవాని ప్రయత్నం వంటిదని ధ్వజమెత్తారు. దేశంలోని మేధావుల మౌనాన్ని మోదీ ప్రభుత్వ చేపట్టిన  ఎన్‌ఎమ్‌పి విధానానికి స్పష్టమైన ఆమోదం తెలిపినట్లుగా ఖర్గే తెలుసుకోవలని ఆయన హితవు చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అనుసరిస్తున్న నిర్ణయాత్మక మార్గాన్ని ఈ దేశ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ దేశాన్ని ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించడం ద్వారా, ఉద్యోగాలు, సంపద సృష్టించడం,  సమర్ధత పెంపొందించడం కోసం వ్యూహాత్మక ఎత్తుకు ఎదగడం ద్వారా ఆర్థిక వికాసానికి దారితీస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ‘యథాతథ స్థితిలో’ విధానాలతో సతమతమవుతున్నదని కృష్ణసాగరరావు ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న పాత, ఆలస్యమైన,  నిష్క్రియాత్మక నిర్ణయాల ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ సరైన వృద్ధిని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడాన్ని భారతీయులు అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.

 
కాంగ్రెస్ పాలనలో భారతదేశానికి తప్పిన అవకాశాలు లెక్కలేనన్ని ఉన్నాయని చెప్పారు. అబద్ధాలు ప్రచారం చేసినందుకు మల్లికార్జున్ ఖర్గే దేశానికి క్షమాపణ చెప్పాలని బిజెపి నేత డిమాండ్ చేశారు. ఎన్‌ఎమ్‌పి రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తోందని ఆయన చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. 
 
తమ స్వార్ధపూరిత ఎన్నికల లాభాల కోసం దశాబ్దాలుగా కాంగ్రెస్ యువత కోసం ఉద్యోగాలు కల్పిస్తామంటూ, ఆర్థిక వ్యవస్థ  ప్రాథమిక అంశాలతో ఎలా రాజకీయాలు ఆడిందో అందరికి తెలుసని దుయ్యబట్టారు. వాస్తవానికి,  ఎన్‌ఎమ్‌పి ఈ దేశంలోని యువతకు లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని కృష్ణసాగరరావు స్పష్టం చేశారు. 
 

మునుపెన్నడూ లేని విధంగా రిజర్వేషన్లకు అర్హులైన వారికి కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారు. ఇది భారీ ఆవశ్యక జాతీయ మౌలిక సదుపాయాలలోకి తిరిగి పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ పెట్టుబడులను మానిటైజ్ చేస్తుందని ఆయన చెప్పారు. అన్ని ప్రధాన రంగాలలోకి ప్రభుత్వ పెట్టుబడులను ప్రవేశపెట్టడంతో ఆర్థిక వ్యవస్థ పైకి ఎగురుతున్నందున,  ఎన్‌ఎమ్‌పి  లక్షల మంది చిన్న వ్యాపారాలకు  ఔత్సాహిక అవకాశాలను సృష్టిస్తుందని బిజెపి నేత స్పష్టం చేశారు.

భారతదేశం తన పాలనా కాలంలో ‘యథాతథ స్థితిలో’ ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ఏదేమైనా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఔత్సాహిక, శక్తివంతమైన,  చురుకైన ఆర్థిక దిగ్గజం కలిగిన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు కృష్ణసాగరరావు వెల్లడించారు.