యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు యాదాద్రి పుణ్య‌క్షేత్రం   ప్రారంభోత్స‌వానికి రావాల‌ని ఆయ‌న‌ను ఆహ్వానించారు. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా భ‌వ‌నం ఏర్పాటు స్థ‌లాన్ని కేటాయించాల‌ని మోదీని కేసీఆర్ కోరారు. ఈ అభ్య‌ర్థ‌న‌ల‌కు ప్ర‌ధాని సానుకూలంగా స్పందించి స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధానిని  కేసీఆర్‌ ఆహ్వానించారు. అక్టోబరు, నవంబరు మాసాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

అత్యద్భుత స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తాను చేపడుతున్న యాదాద్రి నిర్మాణం గురించి మోదీకి వివరించడమే కాకుండా అనేక చిత్రాలను చూపినట్లు తెలిసింది. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. యాదాద్రి ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.

అట్లాగే,  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా, అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు వున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం తెలంగాణ భవన్ నిర్మించుకునేందుకు, ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కేసిఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని, భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ భవన్‌ శంకుస్థాపనకు గురువారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్‌.. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని సమస్యలపై 10 వినతి పత్రాలను ప్రధానికి అందజేశారు. 

తెలంగాణకు రెండు పారిశ్రామిక కారిడార్లు 

రాష్ట్రానికి రెండు పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. మొత్తం 585 కి.మీ హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌తోపాటు హైదరాబాద్‌-వరంగల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను మంజూరు చేయాలని అభ్యర్థించారు. 

ఢిల్లీ-ముంబై కారిడార్‌ స్థాయిలో హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అని, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ల్లో రెండు టెర్మినల్స్‌ ఏర్పాటవుతాయని వివరించారు. ఈ రెండు నగరాలను అంతర్జాతీయ కార్గో హబ్‌లుగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. 

ఇప్పటికే హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మధ్య హైస్పీడ్‌ రైలు కనెక్టివిటీని, ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రతిపాదించారని, వీటి మధ్య ఆరు/ఎనిమిది లేన్ల 44వ నంబర్‌ జాతీయ రహదారి కూడా ఉందని తెలిపారు. 

కారిడార్‌ ఏర్పాటుతో రోడ్డు, రైలు మార్గాలకు ఇరువైపులా దాదాపు 50 కి.మీ వరకు ప్రభావశీల ప్రాంతంగా ఉంటుందని, ఇండస్ట్రియల్‌ టౌన్‌షి్‌పలు, లాజిస్టిక్‌ హబ్‌లు ఏర్పాటవుతాయని వివరించారు. తెలంగాణ, మహారాష్ట్రల్లోని 27 శాతం జనాభా అంటే, దాదాపు 4 కోట్ల మందిని ప్రభావితం చేస్తుందని చెప్పారు. 

కాగా, ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, రాష్ట్రంలో టెక్సటైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేయాల‌ని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు విడుద‌ల చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచడం కోసం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. క‌రీంన‌గ‌ర్‌లో ట్రిపుల్ ఐటీ, హైద‌రాబాద్‌లో ఐఐఎంతో పాటు తెలంగాణ‌లో గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ మోదీని కోరారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు సంబంధించిన లేఖ‌ల‌ను మోదీకి కేసీఆర్ అంద‌జేశారు.