అల్‌ఖైదా నోట కాశ్మీర్ మాట వెనుక పాక్ ప్రోద్భలం!

కాశ్మీర్ తో సహా పలు ప్రాంతాలలో జిహాద్ కోసం అల్‌ఖైదా పిలుపు ఇవ్వడం వెనుక పాకిస్థాన్ ప్రోద్బలం ఉన్నదని భారత్ మండిపడుతుంది. తాలిబన్లకు ప్రాధాన్యతాంశాల్లో కశ్మీరు అంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు కాశ్మీర్ ను ప్రస్తావించడం వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు భారత్ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
 
 గ్లోబల్ జీహాద్ కోసం ఇచ్చిన ప్రకటనలో కశ్మీరును ప్రస్తావించి, చెచెన్యా, జింజియాంగ్‌లను వదిలిపెట్టడం వల్ల అల్‌ఖైదాతో పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి సంబంధాలు ఉన్నాయని వెల్లడవుతోందని భారత్ వర్గాలు స్పష్టం చేశాయి. పాకిస్థాన్ తన ఎజెండాను అల్‌ఖైదా ద్వారా ముందుకు తీసుకెళ్తోందని భారత్ భావిస్తున్నది. ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల ఆధీనమైన తర్వాత భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు అక్కడి భూభాగాన్ని వాడుకొనే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తున్నట్లు ఇప్పుడు స్పష్టం అవుతున్నది.

తాజాగా అల్‌ఖైదా విడుదల చేసిన ప్రకటననుబట్టి ఈ ఉగ్రవాద సంస్థతో పాకిస్థాన్ ఐఎస్ఐకి ఉన్న సంబంధాలు తేటతెల్లమవుతున్నాయని భారత భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. 

ఈ ప్రకటన లక్ష్యం పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను భారత దేశంపై దాడులకు ప్రోత్సహించడమేనని మండిపడ్డారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల పట్ల భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని వారు స్పష్టం చేసారు. ప్రపంచంలోని ముస్లింలను రాడికలైజ్ చేయడానికి అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు.

అల్‌ఖైదా చీఫ్ అయిమన్ అల్ జవహిరి తన నియంత్రణలోనే ఉన్నట్లు పాకిస్థాన్ బాహాటంగానే సంకేతాలు పంపిస్తోంది. తాలిబన్ సుప్రీం కమాండర్ హైబతుల్లా అకుండ్‌జాదా పాకిస్థాన్ ఐఎస్ఐ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అల్‌ఖైదా ఇచ్చిన ప్రకటనలో, ‘‘ఇస్లాంకు శత్రువుల కబంధ హస్తాల నుంచి లేవంట్, సోమాలియా, యెమెన్, కశ్మీరు, ఇతర ఇస్లామిక్ భూములను విముక్తి చేయండి. ఓ అల్లా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఖైదీలకు స్వేచ్ఛను ఇవ్వు’’ అని పిలుపునిచ్చింది. ఈ గ్లోబల్ జీహాద్ పిలుపులో రష్యాలోని చెచెన్యా, చైనాలోని జింజియాంగ్ లేవు.

భారత్ భద్రతా వర్గాలు ఢిల్లీ, కాశ్మీర్‌లో జరిపిన అత్యున్నత స్థాయి  సమావేశాలలో, కాశ్మీర్ లోయపై ఏర్పడగల ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల ప్రభావం గురించి చర్చించారు. నియంత్రణ రేఖ వెంబడి తిరిగి ఉపందుకొంటున్న చొరబాటు దారుల ప్రయత్నాలు, ఆక్రమిత కాశ్మీర్ లో పెరుగుతున్న ఉగ్రవాదుల శిబిరాలను పరిగణలోకి తీసుకున్నారు. 

 యాక్టివేట్ చేయబడిన చొరబాటు మరియు లాంచ్ ప్యాడ్‌లు పెరుగుతున్న సందర్భాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. నిఘా ఏజెన్సీల ద్వారా సేకరించిన సమాచారం నియంత్రణ రేఖ వెంబడి మూసివేసిన ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లు తిరిగి క్రియాశీలం అవుతున్నట్లు వెల్లడైనది. 

కాశ్మీర్‌పై తాలిబాన్లు ఎన్నడూ స్పష్టమైన ఆసక్తి చూపలేదు. పైగా, ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకున్నట్లు ప్రపంచానికి భరోసా ఇస్తున్నారు.  అయినప్పటికీ, హర్కత్-ఉల్ అన్సార్‌తో సహా అనేక తీవ్రవాద గ్రూపులను అనుమతించింది.  హర్కత్-ఉల్-ముజాహిదీన్, హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామి వంటి పలు ఉగ్రవాద గ్రూప్ లకు ఆశ్రయం ఇస్తున్నారు. దానితో కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులను నెట్టడానికి ఆఫ్ఘన్ ను ఉపయోగించుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం తర్వాత కాశ్మీర్‌లో జిహాద్ ప్రారంభించడానికి ముందు జైషే-ఇ-మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్‌లో ఉగ్రవాద శిబిరాన్ని నడిపేవారని, హర్కత్-ఉల్-అన్సార్‌ను కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగించుకొనేవాడని నడిపేవారని నిఘా సంస్థలు చెబుతున్నాయి.


9/11 దాడుల తర్వాత అమెరికా తొలిసారిగా తాలిబన్లను అధికారం నుండి తొలగించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ను ఉగ్రవాదుల చేతుల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే అమెరికా ఆఫ్ఘన్ నుండి వైదొలగే సమయానికి తాలిబాన్లు మెరుగైన ఆయుధాలతో రాటు తేలడం గమనార్హం. 

భారత ఉపఖండంలోని అల్ ఖైదా భద్రతా సంస్థల రాడార్ కింద పనిచేస్తోంది. దాని “భారత ఉపఖండం” యూనిట్ తాలిబన్లు కొందరిని తమలో కలుపుకోవడం ద్వారా తమ ఉనికిని పటిష్ఠపరచుకున్నట్లు తెలుస్తున్నది.  “పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రయోగించడానికి, శిక్షణ ఇవ్వడానికి ఆఫ్ఘన్ మట్టిని ఉపయోగిస్తోంది, కాబట్టి ప్రతి నిమిషానికి కొత్త డైనమిక్స్ గురించి మనం తెలుసుకోవాలి” అని ఒక భారత అధికారి స్పష్టం చేశారు.