ఆఫ్ఘన్ లో భారత్ కు వ్యతిరేకంగా పాక్ ను చైనా బలోపేతం!

ఆఫ్ఘానిస్తాన్ పై ప‌ట్టు సాధించి,  భార‌త్‌కు వ్య‌తిరేకంగా పాకిస్థాన్ ను చైనా మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని ఐరాస‌లో అమెరికా మాజీ రాయ‌బారి నిక్కీ హేలీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆఫ్ఘన్ లోని బాగ్రాం వైమానిక ద‌ళ స్థావ‌రాన్ని చైనా ఆక్ర‌మించుకునే ప్రయత్నం చేస్తున్నద‌ని  అమెరికాను ఆమె  హెచ్చరించారు. అఫ్ఘాన్‌ ప్రభుత్వం చైనా, పాక్‌ కనుసన్నల్లో కొనసాగనుందని ఆమె స్పష్టం చేశారు. 
 
గ‌త జూలైలో బాగ్రాం వైమానిక ద‌ళ స్థావ‌రాన్ని అమెరికా సేన‌లు వీడాయి. వేలాది మంది అమెరిక‌న్ సేన‌ల‌కు వ‌స‌తి క‌ల్పించిన ఎయిర్ బేస్ ఇది. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఇది కీల‌క స్థావ‌రం. ఈ వైమానిక స్థావరం భవిష్యత్ లో ప్రపంచ దేశాలపై దాడులకు స్థావరంగా మారే ప్రమాదం ఉన్నదని ఆమె హెచ్చరించారు.  చైనా కదలికలపై అమెరికా అప్రమత్తంగా ఉండాలని జో బైడెన్ ప్రభుత్వాన్ని ఆమె వారించారు.
 
2024కి జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బలమైన అభ్యర్థి కావచ్చని భావిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హెలి తాలిబాన్లకు అమెరికా పూర్తిగా లొంగిపోయినదని, తన మిత్రపక్షాలకు దూరమైనదని ఆరోపించారు. ఉగ్రవాదులకు బిడెన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి, ప్రపంచం దృష్టిలో అమెరికాను నవ్వులపాలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి సైన్యం ఉప‌సంహ‌ర‌ణ‌తో జో బైడెన్ ఆమెరికా సంకీర్ణ సేన‌ల విశ్వాసాన్ని కోల్పోయార‌ని ఆమె పేర్కొన్నారు.
నాటో దళాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బగ్రామ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను అప్పగించడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  85 బిలియన్ డాలర్ల విలువైన పరికరాలు, ఆయుధాలను వదిలిపెట్టి వచ్చారని అంటూ, వాటిని దేశం నుంచి పంపించి ఉండవలసినదని హేలీ స్పష్టం చేశారు. 
 
అమెరికా ముందు ప‌లు స‌వాళ్లు పొంచి ఉన్నాయ‌ని చెబుతూ చైనాను అడ్డుకునేందుకు భార‌త్‌, జ‌పాన్‌, ఆస్ట్రేలియా, తైవాన్, ఉక్రెయిన్  వంటి మిత్ర దేశాలు, కీల‌క స్నేహితుల‌తో క‌లిసి అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప‌ని చేయాల్సి ఉంద‌ని ఆమె సూచించారు. మన మిత్రపక్ష దేశాలను బలోపేతం చేయాలని, వారితో సంబంధాలను పటిష్ట పరచాలని, మన సైన్యాన్ని ఆధునీకరించాలని ఆమె బిడెన్ ప్రభుత్వంకు సూచించారు.
 
“మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, వెంటనే మన మిత్రదేశాలైన తైవాన్‌, ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌, భారత్,  ఆస్ట్రేలియా, జపాన్ లతో కనెక్ట్ కావడం ప్రారంభించాలి. వెన్నుదన్నుగా ఉంటామని వారికి భరోసా ఇవ్వాలి. వాళ్ళ అవసరం మనకెంతో ఉంది” అని హేలీ బిడెన్ ప్రభుత్వంకు స్పష్టం చేశారు. 
 
దేశ సైబ‌ర్ సెక్యూరిటీతోపాటు అమెరిక‌న్లను ర‌క్షించ‌డానికి బైడెన్ ప్రభుత్వం ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిక్కీ హేలీ తెలిపారు. అమెరికాకు సైబర్, ఉగ్రదాడుల ముప్పు ఉన్నదని ఆమె హెచ్చరించారు. వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అమెరికా ఉధృతం చేయాలని ఆమె సూచించారు. 
ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ లో లభించిన `నైతిక విజయం’తో ప్రపంచ వ్యాప్తంగా జిహాదీ గ్రూపులు యువకులను పెద్ద ఎత్తున తమలో చేర్చుకొని ప్రయత్నం చేస్తాయని ఆమె చెప్పారు. అమెరికా ఎదురు దాడి జరిపే పరిస్థితుల్లో లేదని గ్రహించి రష్యా సహితం అమెరికాపై దృష్టి సారిస్తోంది తెలిపారు.
 
“అమెరికా పారిపోవడంతో జిహాదీలు వీధుల్లో సంబరాలు చేసుకుంటున్నారనే వాస్తవాన్ని మీరు చూస్తే, పైగా వారికి బిలియన్ల డాలర్ల విలువైన సామగ్రిని, ఆయుధాలను గృహప్రవేశం కానుకగా అందించడం గమనిస్తే రాగాల ప్రమాదాలను గ్రహించవచ్చు” అంటూ బిడెన్ ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. 
 
“ఆయన సైనికులలో ప్రతివారి విశ్వాసాన్ని కోల్పోయారు. నేను కూడా భాగమని గర్వపడుతున్న సైనిక కుటుంబాల విశ్వాసం కోల్పోయారు. మన మిత్రుల విశ్వాసాన్ని  కోల్పోయారు. ఇప్పుడు మనం లేకుండా మన మిత్రదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఎందుకంటే మనం ఏమి చేస్తున్నామో వారికి తెలియడం లేదు” అంటూ బిడెన్ విధానాలపై ఆమె మండిపడ్డారు.

బిడెన్ అమెరికన్ ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోయారని ఆమె ఆరోపించారు. ఇప్పటికన్నా ఇబ్బందికరమైన, అవమానకరమైన పరిస్థితి  అమెరికాకు ఏర్పడబోదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఆఫ్ఘానిస్తాన్ నుండి బైట పడడంతో ఉగ్రవాదంతో మనం ప్రారంభించిన యుద్ధం ముగిసిన్నట్లు కాదని ఆమె స్పష్టం చేశారు.