పారాలింపిక్స్‌లో హైజంప్‌లో భారత్‌కు సిల్వర్‌

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నది. పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్‌లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన జోనాథన్‌ ఎడ్‌వర్డ్స్‌ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్‌ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జొనాథన్‌ బంగారు పతకం సాధించగా, ప్రవీణ్‌ కుమార్‌ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక పోలాండ్‌కు చెందిన మసీజ్‌ లెపియాటోకు బ్రోన్జ్‌ మెడల్‌ దక్కింది.

ఇలా ఉండగా, పారాలింపిక్స్‌ లో 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచి ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా నిలిచిన అవ‌ని లెఖారా ఇప్పుడు 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె  నిల‌వ‌డం విశేషం.

దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో భార‌త్ ప‌త‌కాల సంఖ్య 12కు చేరింది. ఇందులో రెండు బంగారు (అవని లెఖారా, సుమిత్‌), ఆరు సిల్వర్ (ప్రవీణ్‌ కుమార్‌, మరియప్ప తంగవేల్‌, దేవేంద్ర ఝజారియా, యోగేష్‌ కథునియా, నిషద్‌ కుమార్‌, భవీనాబెన్‌ పటేల్‌) ‌, మూడు4వెండి (శరద్‌ కుమార్‌, సిఘ్రాజ్‌ అధనా, సుందర్‌ సింగ్‌ గుర్జర్‌, అవ‌ని) మెడల్స్‌ ఉన్నాయి.

ప్రవీణ్ పుట్టినప్పటి నుంచి ఒక కాలు పొడవు మరొక కాలు పొడవు కన్నా తక్కువగా ఉంది. ఆయన బాల్యం నుంచి క్రీడలపట్ల ఆసక్తిని ప్రదర్శించేవాడు. వాలీబాల్ ఆడటాన్ని మొదట్లో ఇష్టపడేవాడు. ఒకసారి శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారితో కలిసి హై జంప్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు.

అప్పుడు శారీరక సామర్థ్య లోపాలుగలవారికి కూడా ప్రత్యేకంగా క్రీడా పోటీలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆయనకు డాక్టర్ సత్యపాల్ సింగ్ శిక్షణ ఇచ్చారు.  ఆయన దుబాయ్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్ FAZZA Grand Prix 2021లో బంగారు పతకం సాధించి, ఆసియా రికార్డు సృష్టించాడు.

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించిన హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 
 
‘పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించినందుకు గర్వపడుతున్నాను. ఈ పతకం అతని కృషి, అసమానమైన అంకితభావానికి నిదర్శనం. ప్రవీణ్‌ కుమార్‌కు అభినందనలు. భవిష్యత్‌లో అతను చేసే ప్రయత్నాలకు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా అభినందించారు.
 
కాగా,  బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌లో తరుణ్‌ ధిల్లాన్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. కొరియాకు చెందిన షిన్‌ యుంగ్‌ వాన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో 21-18, 15-21, 21-17తో గెలుపొందాడు. దీంతో పారాలింపిక్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇక బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ గ్రూప్‌ స్టేజ్‌లో సుహాస్‌ యతిరాజ్‌ విజయం సాధించాడు. 21-6, 21-12 పాయింట్ల తేడాతో ఇండోనేషియాకు చెందిన సుసాంతో హారీపై గెలుపొందాడు.అదేవిధంగా కనోయి స్ప్రింట్‌ మహిళల 200 మీటర్ల విభాగంలో ప్రాచి యాదవ్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది.