దాదాపు రెట్టింపైన బిలియన్ డాలర్ల స్టార్టప్‌ లు

ఈ ఏడాది బిలియన్‌ డాలర్లకుపైగా విలువ కలిగిన స్టార్టప్‌ (యునికాన్‌)ల సంఖ్య దేశంలో దాదాపు రెట్టింపైందని తేలింది. నెలకు మూడు చొప్పున పెరుగుతూపోయిన యునికాన్లు.. గత నెలాఖరుకల్లా 51కి చేరాయని ‘హురున్‌ ఇండియా ఫ్యూచర్‌ యునికాన్‌ జాబితా- 2021’ తెలియజేసింది.
 
 స్టార్టప్‌ విలువ 1 బిలియన్‌ డాలర్లు దాటితే ‘యునికాన్‌’ అని, 500 మిలియన్‌ డాలర్లు మించితే ‘గ్యాజిల్‌’, 200 మిలియన్‌ డాలర్లకుపైగా ఉంటే ‘చీతా’ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో గ్యాజిల్‌ సంఖ్య 32, చీతాలు 54 ఉన్నాయని హురున్‌ తమ తాజా నివేదిక ద్వారా వెల్లడించింది. గ్యాజిల్‌ రెండేండ్లలో, చీతా నాలుగేండ్లలో యునికాన్‌ హోదాను అందుకోవడానికి అవకాశాలుంటాయని చెప్పింది. 
వచ్చే 2-4 ఏండ్లలో జిలింగో, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌, రెబల్‌ ఫుడ్స్‌, క్యూర్‌.ఫిట్‌, స్పిన్ని, రేట్‌ గెయిన్‌, మామాఎర్త్‌, కార్‌దేఖో, గ్రేఆరెంజ్‌, మొబిక్విక్‌ తదితర స్టార్టప్‌లు యునికాన్లుగా అవతరించేందుకు పుష్కలంగా వీలున్నట్లు ఈ సందర్భంగా హురున్‌ ఇండియా ఎండీ, ప్రధాన పరిశోధకుడు అనస్‌రెహమాన్‌ జునైద్‌ చెప్పారు. వీటన్నిటి విలువ ప్రస్తుతం 36 బిలియన్‌ డాలర్లుగా ఉందన్న ఆయన గడిచిన ఎనిమిది నెలల్లో ఐదు స్టార్టప్‌లు చీతా హోదా నుంచి నేరుగా యునికాన్‌ స్థాయికి ఎదిగాయని గుర్తుచేశారు. ఢిల్లీ జిడిపి విలువలు ఇది మూడోవంతు కావడం గమనార్హం.
దేశంలో ప్రస్తుతం 600మిలియన్లకుపైగా ఇంటర్నెట్‌ వినియోగదారులున్నారని, 2025 నాటికి 900 మిలియన్లకు చేరుకోవచ్చని, ఇది టెక్నాలజీ స్టార్టప్‌ల పెరుగుదలకు దోహదం చేయవచ్చని పేర్కొన్నారు. మొబైల్‌ పేమెంట్స్‌, బీమా, బ్లాక్‌చైన్‌, స్టాక్‌ ట్రేడింగ్‌, డిజిటల్‌ లెండింగ్‌ స్టార్టప్‌లకు విరివిగా అవకాశాలున్నాయని తెలిపారు.
 
ప్రస్తుతం, యూనికార్న్  లు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో యుఎస్ (396) మరియు చైనా (277) కంటే వెనుకబడిన దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది, కానీ యుకె (32) , జర్మనీ (18) కంటే ముందుంది. అయితే వాస్తవానికి భారత్ లో వీటి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  కొన్ని స్టార్టప్‌లు మెరుగైన నిబంధనలు, మూలధన లభ్యత కోసం నిర్దిష్ట స్థాయిని సాధించిన తర్వాత దేశం విడిచి వెళ్లిపోయాయి. 
సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (సాస్‌) సంస్థలు భారత్‌లోనే పుట్టుకొస్తున్నా.. అమెరికాకు తరలిపోతున్నాయని, మరిన్ని ప్రోత్సాహకాలుంటే తిరిగి అవన్నీ భారత్‌కు వస్తాయని హురున్‌ అభిప్రాయపడింది. ఈ జాబితా ప్రకారం బెంగుళూరు 31 స్టార్టప్‌లకు నిలయం, తర్వాతి స్థానాలలో ఢిల్లీ ఎన్‌సిఆర్ 18, ముంబై 13 ఉన్నాయి. వయస్సు దృక్కోణంలో, జాబితాలో 11 కంపెనీల సహ వ్యవస్థాపకులు 30 ఏళ్లలోపు వారు కాగా,15 మంది 50 ఏళ్లు పైబడిన వారు.
స్టార్టప్‌ వ్యవస్థాపకుల్లో అత్యధికంగా ఐఐటీ ఢిల్లీకి చెందినవారే 17 మంది ఆ తర్వాత ఐఐటీ బాంబే (15),ఐఐటీ కాన్పూర్‌ (13), ఐఐఎం అహ్మదాబాద్‌ (13) గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఐఐఎం, ఐఐటీ గ్రాడ్యుయేట్ల నుంచే ఎక్కువగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.