రాజేష్ ఎక్సపోర్ట్స్ రూ.15 లక్షల కోట్ల మాయాజాలం

రాజేష్ ఎక్సపోర్ట్స్ రూ.15 లక్షల కోట్ల మాయాజాలం
 
* భారత కార్పొరేట్ చరిత్రలో అతి పెద్ద రెవెన్యూ స్కామ్

ప్రముఖ బంగారం, ఆభరణాల తయారీ దిగ్గజం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌ (ఆర్‌ఇఎల్‌)  ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించి భారీ రెవెన్యూ స్కామ్ కు పాల్పడింది. సెబీ విడుదల చేసిన 109 పేజీల నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  భారత కార్పొరేట్ చరిత్రలోనే దీనిని అతి పెద్ద రెవెన్యూ కుంభకోణంగా చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థపై సెబి చర్యలకు దిగింది. ఆ సంస్థ ప్రమోటర్ రాజేష్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ నుండి తాత్కాలికంగా నిషేధించింది.

దీంతో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమ య్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థలో వాటా ఉన్న ఎల్ఐసి షేర్లు కూడా పతనమయ్యాయి. 2020-21 నుండి 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ తన ఏకీకృత ఆదాయాన్ని ఏకంగా రూ.15.15 లక్షల కోట్లు ఎక్కువగా చూపించిందని సెబీ ప్రాథమిక విచారణలో తేల్చింది. కంపెనీ పుస్తకాల్లో నమోదైన మొత్తం గ్రూప్ ఆదాయంలో ఇది దాదాపు 97 శాతం నుండి 99 శాతం వరకు అధిక రెవెన్యూ ఉండటం గమనార్హం. 

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తర్వాత, ఇంత భారీ స్థాయిలో ఆదాయాన్ని అక్రమంగా పెంచి చూపించిన సంస్థ ఇదేనని చెబుతున్నారు. ఈ ఆదాయాల వ్యత్యాసాల వెనుక ప్రధానంగా ఆర్‌ఇఎల్‌ కంపెనీకి చెందిన విదేశీ అనుబంధ సంస్థల పాత్ర ఉన్నట్లు సెబీ గుర్తించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ అయిన స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్కాంబిని రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 2015లో కొనుగోలు చేసింది. 

అయితే, ఈ స్విస్ సబ్సీడరీ స్వతంత్ర ఆడిట్ నివేదికల్లోని వార్షిక ఆదాయానికి, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ గ్రూప్ లెక్కల్లో చూపించిన ఆదాయానికి మధ్య ఏమాత్రం పొంతన లేకపోవడం గమనార్హం. వందల కోట్ల ఆదాయాన్ని లక్షల కోట్లుగా ఎలా మార్చారనే ప్రశ్నకు కస్టమర్ల వివరాలు లేదా ఇన్‌వాయిస్‌ల వంటి ఎలాంటి బలమైన ఆధారాలను కంపెనీ చూపలేకపోయిందని సెబి పేర్కొంది. ఆదాయాన్ని పెంచి చూపడమే కాకుండా కంపెనీలో తీవ్రమైన కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, నిధుల మళ్లింపు జరిగినట్లు సెబీ గుర్తించింది.

కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) రాజేష్ మెహతా తన వ్యక్తిగత ఖాతాల ద్వారా దాదాపు రూ.11,487 కోట్ల విక్రయాలు, రూ.11,488 కోట్ల కొనుగోళ్లతో కూడిన డెరివేటివ్ లావాదేవీలను నిర్వహించారు. ఈ భారీ లావాదేవీలను నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ బుక్‌లలో బిజినెస్ ట్రేడింగ్‌గా చూపించారు. అలాగే బోర్డు లేదా ఆడిట్ కమిటీ ముందస్తు అనుమతులు లేకుండానే కంపెనీ నిధులను ప్రమోటర్ల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించినట్లు తెలుస్తోంది.

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్థిక అక్రమాల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఒక సాధారణ ఇన్వెస్టర్ పంపిన ఈ మెయిల్‌తోనే వెలుగులోకి వచ్చాయి. 2025 మార్చి 11న సెబీ ఇన్‌బాక్స్‌కు ఒక సాధారణ వాటాదారు పంపిన ఫిర్యాదులో.. కంపెనీ ఖాతాల్లో కస్టమర్ల నుంచి రావాల్సిన బకాయిలు ఏళ్ల తరబడి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన సెబీ తొలుత ఓ దర్యాప్తు అధికారిని, ఆ తర్వాత బిడిఓ ఇండియాను ఫోరెన్సిక్ ఆడిటర్‌గా నియమించింది. 

ఆడిట్ సంస్థకు కంపెనీ యాజమాన్యం తమ ప్రధాన ఇఆర్‌‌పి సిస్టమ్స్ పరిశీలించడానికి అనుమతించకపోవడంతో పాటు.. రూ.7,000 కోట్లకు పైగా శాంపిల్ లావాదేవీలలో కేవలం చిన్న మొత్తానికి మాత్రమే ఆధారాలు చూపడంతో సెబీ రంగంలోకి దిగింది. 2025 అంతటా వరుస సమన్లు జారీ చేసిన సెబీ తాజాగా బుధవారం తన రిపోర్ట్‌‌ను బయటపెట్టింది.

సంస్థపై వచ్చిన ఆరోపణలపై విచారించడానికి రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ సహకరించలేదు. యాజమాన్యం ప్రధాన ఇఆర్‌‌పి అకౌంటింగ్ సిస్టమ్స్‌ను పరిశీలించడానికి ఆడిటర్లను అనుమతించలేదని, కీలక పత్రాలను దాచిపెట్టి విచారణకు ఏమాత్రం సహకరించలేదని సెబీ స్పష్టం చేసింది. కీలక ఆర్థిక పత్రాలను దాచిపెట్టి దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని సెబీ తన నివేదికలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.