ముసాయిదా ఒప్పందంలో శిలాజ ఇంధనాల ప్రస్తావన లేని కాప్31

టర్కీలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చల్లో, వైఫల్యంపై గుసగుసలు, నిరసనల మధ్య పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేక, ప్రతినిధులు కొన్ని నిర్ణయాలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అయినప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే అత్యంత వినాశకరమైన ప్రభవాలను నివారించడానికి ప్రపంచం కలిసికట్టుగా పనిచేసే మార్గాలను కనుగొనగలమని నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు.
 
 “మేము ముగింపు రేఖకు దగ్గరగా ఉన్నాము కానీ ఇంకా అక్కడికి చేరుకోలేదు,” అని కాప్31గా పిలువబడే రెండు వారాల సదస్సుకు అధ్యక్షత వహించిన టర్కీ పర్యావరణ మంత్రి మురత్ కురుమ్ తెలిపారు. రాత్రిపూట జరిగిన ఒక సమావేశంలో, ప్రతినిధులు “వైఫల్యం” అని రాసి ఉన్న నిరసన బ్యానర్‌ను దాటుకుంటూ వెళ్లారు. అదే సమయంలో, కురుమ్ మాట్లాడుతుండగా ఒక నిరసనకారుడు అడ్డుపడి, “మీరు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మీరు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు” అని అరిచాడు. 
 
“అవును, మేము అలసిపోయాము. మేము చాలా కృషి చేశాము—కానీ ప్రపంచానికి నిజంగా అర్థవంతమైన సందేశాలను అందించగల సామర్థ్యం మాకు ఇంకా ఈ హాలులోనే ఉంది,” అని కురుమ్ రాత్రి వేడుకున్నారు. “ఏకాభిప్రాయానికి రావడం ద్వారా, మనం నిజమైన మార్పును తీసుకురాగలము” అని చెప్పారు. 
 
వాతావరణ మార్పును ప్రపంచం ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించడానికి ఉద్దేశించిన తుది ఒప్పందం తాజా ముసాయిదాలో “శిలాజ ఇంధనాలు” అనే పదాన్ని కనీసం ప్రస్తావించకపోవడం కార్యకర్తలు, దేశాధినేతలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దాదాపు 200 దేశాలు, కేవలం ఏకగ్రీవ అంగీకారంతో మాత్రమే ఆమోదించే ఇటువంటి ఒప్పందాలు స్వచ్ఛందమైనవి, కట్టుబడి ఉండాల్సినవి కావు.
 
శిలాజ ఇంధనాలను — బొగ్గు, చమురు, సహజ వాయువులను — మండించడమే వాతావరణ మార్పుకు ప్రధాన కారణం. మూడు సంవత్సరాల క్రితం వరకు, 25 సంవత్సరాలకు పైగా తుది నిర్ణయాలలో శిలాజ ఇంధనాల ప్రస్తావన రాలేదని, దీనికి ప్రధాన కారణం సౌదీ అరేబియా అభ్యంతరాలేనని యూరోపియన్ థింక్-ట్యాంక్ ఈ3జి దీర్ఘకాల విశ్లేషకుడు ఆల్డెన్ మేయర్ పేర్కొన్నారు.
 
అయితే, 2023లో దుబాయ్‌లో, “శిలాజ ఇంధనాల నుండి దూరంగా మారడానికి” ప్రపంచం అంగీకరించింది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే దీర్ఘకాలిక ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ (2.7 డిగ్రీల ఫారెన్‌హీట్)కు పరిమితం చేయాలన్న 2015 పారిస్ ఒప్పందంలోని లక్ష్యాన్ని భూమి ఖచ్చితంగా ఉల్లంఘిస్తుందన్న తీవ్ర హెచ్చరికల మధ్య ఈ ఏడాది చర్చలు జరిగాయి. 
 
బర్కిలీ ఎర్త్ ప్రకారం, 1800ల మధ్యకాలంతో పోలిస్తే అక్టోబర్ 2026లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల సెల్సియస్ (3.4 డిగ్రీల ఫారెన్‌హీట్) అధికంగా ఉంది. అంతేకాకుండా, యూరప్‌లో ప్రాణాంతకమైన వడగాలులు, నేపాల్‌లో వినాశకరమైన వరదలతో సహా వాతావరణ సంబంధిత విపత్తులు సంభవించిన ఒక సంవత్సరం తర్వాత ఇది వచ్చింది.
 
“ప్రజలను రక్షించేది గానీ, గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను పరిష్కరించేది గానీ ఏదీ ప్రతిపాదనలో లేదు,” అని క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తస్నీమ్ ఎస్సోప్ చెప్పారు. ఆ కార్యక్రమంలో హాజరైనవారు “సిగ్గుచేటు!” అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. 
 
ప్రతిపాదనలో ఉన్న ప్రధాన లక్ష్యాలలో ఒకటి, మొత్తం ప్రపంచ ఇంధన వినియోగంలో విద్యుత్ వాటాను నేటి సుమారు 21% నుండి 2035 నాటికి 35%కి పెంచడం. కానీ, సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని తాజా ముసాయిదా నిర్దేశించలేదు. దీనివల్ల, శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లను కూడా విద్యుదీకరణ ప్రయత్నంలో భాగంగా పరిగణించేందుకు అవకాశం ఉంది. 
 
ఐక్యరాజ్యసమితి 30 ఏళ్లకు పైగా వాతావరణ చర్చలకు ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన 2021 శిఖరాగ్ర సమావేశం వరకు శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పులకు దోహదపడతాయని అంగీకరించలేదు. రెండు సంవత్సరాల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో, దేశాలు మొదటిసారిగా శిలాజ ఇంధనాల నుండి పూర్తిగా వైదొలగాలని స్పష్టంగా పిలుపునిచ్చాయి. 
 
వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశాలకు నష్టపరిహారం చెల్లించే నిధిని మూడు రెట్లు పెంచాలని ముసాయిదా ఒప్పందంలో ఉంది. కానీ దాని మొత్తాన్ని మాత్రం పేర్కొనలేదు. ఈ సమస్యకు పెద్దగా దోహదపడనప్పటికీ, వాతావరణ విపత్తుల భారాన్ని మోస్తున్న పేద, బలహీన దేశాలకు సహాయం చేయడానికి ఏటా కనీసం 120 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ముసాయిదా మునుపటి వెర్షన్ పేర్కొంది. వాతావరణ మార్పులకు ఎక్కువగా దోహదపడిన సంపన్న దేశాల నుండి ఈ డబ్బు రావాలి. కానీ ధనిక దేశాలు గతంలో అంగీకరించిన నిధులను కూడా అందించడం లేదు.
  

About The Author