టీమిండియా క్రికెటర్ యుజేంద్ర చాహల్ శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ లో చేరిన వెంటనే చాహల్‌కు కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీలోని ఓబీసీ విభాగం ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. యూపీ ఎన్నికల ముంగిట చాహల్ చేరిక బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. అంతకు ముందు బీజేపీ ఓబీసీ మోర్చా చీఫ్ అమర్‌పాల్ మౌర్యతో చాహల్ భేటీ అయ్యారు.
1990లో జన్మించిన చాహల్ పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. క్రికెటర్‌గా ఎదగడానికి ముందు చాహల్ చెస్ ప్లేయర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. టీ20ల్లో 400 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చాహల్ రికార్డు క్రియేట్ చేశారు. 2016 జూన్ 11 హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా చాహల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు.
చాహల్ చివరిగా 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడారు. టీమిండియా మేనేజ్‌మెంట్ ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తుండటం, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లాంటి స్పిన్నర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో చాహల్‌కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. భారత జట్టులో చోటు లభించనప్పటికీ చాహల్ ఐపీఎల్‌లో మాత్రం కీలకంగా మారారు.
ఐపీఎల్ చరిత్రలోనే 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఐపీఎల్‌లో రెండు హ్యా్ట్రిక్‌లు సాధించడంతోపాటు 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నారు. 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ చాహల్‌ను ఏకంగా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన స్పిన్నర్ చాహలే.
చాహల్ కంటే ముందు 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి యూపీ నుంచి ఎంపీ గెలిచిన మహ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ సైతం రాజకీయాల్లో ఉన్నారు. హర్భజన్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.
యూసఫ్ పఠాన్ టీఎంసీ బెంగాల్ నుంచి లోక్ సభలో అడుగుపెట్టారు. తర్వాత ఆయన సైతం పార్టీ మారారు. బీజేపీ నుంచి ఎంపీగా ఎంపీగా పని చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయ్యారు. మహ్మద్ కైఫ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. టీమిండియా తరఫున క్రికెట్ ఆడిన కేదార్ జాదవ్ సైతం 2025లో బీజేపీలో చేరారు.
2024లో అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రవీంద్ర జడేజా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. 2021 డిసెంబర్లో బీజేపీలో చేరిన దినేష్ మోంగియా 2022 పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేశారు. భారత మాజీ పేసర్ అశోక్ దిండా 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి మొయినా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు..
టీఎంసీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మనోజ్ తివారీ, లక్ష్మీ రతన్ శుక్లా మంత్రులుగానూ పని చేశారు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తొలుత వైసీపీలో చేరినప్పటికీ వెంటనే జనసేనలోకి మారారు. భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం 2019 ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఢిల్లీ ఈస్ట్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 2024లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
2007, 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన కేరళ క్రికెటర్ శ్రీశాంత్ సైతం 2016లో బీజేపీలో చేరారు. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇటీవల ఢిల్లీలో ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరితో భేటీ అయ్యారు. 2027 యూపీ ఎన్నికల్లో షమీ ఎన్డీయే తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

More Stories
ముసాయిదా ఒప్పందంలో శిలాజ ఇంధనాల ప్రస్తావన లేని కాప్31
కాశ్మీర్ లోయలో ఇక స్థానిక ఉగ్రవాదులు ఎవరూ లేరు
గతంలో వార్తా శీర్షికలు కుంభకోణాల గురించి, ఇప్పుడు పెట్టుబడులు