కాశ్మీర్ వైపు దృష్టి సారిస్తున్న అల్‌ఖైదా!

అమెరికా సేన‌లు వెళ్ల‌గానే ఆఫ్ఘ‌నిస్థాన్‌కు పూర్తి స్వాతంత్య్రంను  ప్ర‌క‌టించుకున్న తాలిబాన్లకు శుభాకాంక్షలు చెబుతూ ఇలాగే ఇస్లామేత‌ర శ‌క్తుల నుంచి క‌శ్మీర్‌నూ విడిపించుకుందామ‌ని ఉగ్ర‌వాద సంస్థ అల్‌ఖైదా వాళ్ల‌కు పిలుపునిచ్చింది. అమెరికా సేన‌లు ఆఫ్ఘ‌న్‌ను విడిచి వెళ్లిన మ‌రుస‌టి రోజే అల్‌ఖైదా ఆ మేరకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయడం గమనిస్తే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు కాశ్మీర్ వైపు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఇస్లాం శ‌త్రువుల నుంచి లెవాంట్‌, సోమాలియా, యెమెన్‌, క‌శ్మీర్‌తోపాటు ఇత‌ర ముస్లింల భూభాగాల‌ను విడిపించుకుందాం. ఓ అల్లా.. ప్ర‌పంచంలోని ముస్లిం ఖైదీలంద‌రికీ స్వేచ్ఛ ప్ర‌సాదించు అని ఆ ప్ర‌క‌ట‌న‌లో అల్‌ఖైదా చెప్పింది. “అమెరికా ఓడిపోయింది. దాని ప్రపంచ ప్రతిష్ట దెబ్బతింది. అవమాననైకి గురయింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి గెంటివేయబడింది” అంటూ ఆ ప్రకటనలో సంతోషం ప్రకటించింది.
 
అమెరికా నిష్క్రమణను ప్రస్తావిస్తూ  “అవిశ్వాసానికి అధిపతి అయిన అమెరికాను అవమానపరిచి, ఓడించిన సర్వశక్తిమంతుడిని మేము ప్రశంసిస్తున్నాము. అమెరికా వెన్ను విరిచినందుకు, ప్రపంచ ఖ్యాతిని మసకబారినందుకు, దానిని బహిష్కరించినందుకు మేము ఆయనను ప్రశంసిస్తున్నాము” అంటూ పేర్కొన్నారు. 
 
ఆగ‌స్ట్ 30 అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా చివ‌రి విమానం టేకాఫ్ అయింది. దీంతో ఆ దేశంలో అగ్ర‌రాజ్యం రెండు ద‌శాబ్దాల యుద్ధం ముగిసింది. అస‌లు ఆఫ్ఘ‌న్‌లో ఈ యుద్ధానికి కార‌ణం ఈ అల్‌ఖైదానే కావడం గమనార్హం.
 
2001, సెప్టెంబ‌ర్ 11న న్యూయార్క్‌లోని ట్విన్ ట‌వ‌ర్స్‌పై దాడిలో ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన అల్‌ఖైదా వ్య‌వ‌స్థాప‌కుడు బిన్ లాడెన్‌ను వెంటాడుతూ అమెరికా ఈ ఆఫ్ఘ‌నిస్థాన్‌కు వ‌చ్చింది. లాడెన్‌కు ఆశ్ర‌య‌మిచ్చిన తాలిబ‌న్ల‌ను అధికారంలో నుంచి దింపింది. అయితే 20 ఏళ్ల త‌ర్వాత అమెరికా తిరిగి వెళ్లిపోవ‌డంతో ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకే వెళ్లిపోయింది.
 
తాలిబన్ సంబరాలు 
 
తాలిబాన్ మద్దతుదారులు అమెరికా, నాటో జెండాలతో కప్పిన శవపేటికలను మంగళవారం తూర్పు నగరమైన ఖోస్ట్‌లో తాలిబన్లు ఊరేగించారు, చివరి అమెరికా దళాలు ఉపసంహరించుకున్న తరువాత దేశవ్యాప్తంగా వేడుకల్లో భాగంగా. ఫ్రెంచ్, బ్రిటిష్ జెండాలతో కప్పిన శవపేటికలను కూడా పెద్ద జనసమూహం ద్వారా వీధి వెంట తీసుకెళ్ళింది