ఆఫ్ఘన్ లో ఉగ్రవాదంపై చోటు వద్దన్న భద్రతా మండలి 

అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కట్టుబడి ఉంటామన్న హామీని నిలబెట్టుకోవాలని తాలిబన్లకు గుర్తు చేస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. తమ గడ్డపై ఏ రూపంలో కూడా ఉగ్రవాదంకు అవకాశం ఇవ్వద్దని స్పష్టం చేసింది. భారత దేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని ఆఫ్ఘానిస్తాన్ నుండి తమ దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత అమెరికా, యుకె, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. 

అయితే ఈ అంశంపై భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాల మధ్య చీలిక వచ్చింది. శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) ఆమోదించిన తీర్మానం 2593 ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత దేశ ఆందోళనను వివరించింది.

ఉగ్రవాదులు ఏ దేశాన్నైనా బెదిరించడానికి లేదా దాడి చేయడానికి లేదా ఆశ్రయం ఇవ్వడానికి లేదా శిక్షణ ఇవ్వడానికి లేదా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడానికి ఆఫ్ఘానిస్తాన్ తమ భూభాగంలో అనుమతించకూడదని ఈ తీర్మానం కోరింది. విదేశీ దళాలు నిష్క్రమించడంతో ఆఫ్ఘన్ లో ఇస్లామిస్ట్ ఛాందసవాదంకు కేంద్రంగా మారిపోగలదని సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

మానవహక్కుల పరిరక్షణకు, ముఖ్యంగా మహిళలు, బాలలు, మైనారిటీల హక్కులకు హామీ ఇవ్వాలని ఈ తీర్మానం తాలిబన్లను కోరింది. ఈ సందర్భంగా వారు ఆగష్టు 27న ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. అవసరంలో ఉన్నవారందరికీ మానవీయ సాయం అందడానికి ఐక్యరాజ్యసమితికి, దాని అనుబంధ వ్యవస్థలకు సంపూర్ణ, సురక్షిత ప్రవేశం కల్పించాలని కోరింది. ఈ తీర్మానం పట్ల శాశ్వత సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆఫ్ఘన్ సంక్షోభం పట్ల వైఖరిని విభజిస్తున్నట్లు ఆరోపిస్తూ రష్యా, చైనా ఓటింగ్‌కు హాజరు కాలేదు.

యూఎన్ఎస్‌సీలో రష్యా ప్రతినిధి మాట్లాడుతూ, అమెరికా రాసిన ఈ ముసాయిదా తీర్మానంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదులను ‘‘మీ వారు, మా వారు’’ అంటూ విభజించారని ఆరోపించారు. తాలిబన్, దానికి అనుబంధంగా ఉన్న హక్కానీ నెట్‌వర్క్ పట్ల మారుతున్న వైఖరిని సూచిస్తోందని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు గతంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికన్, ఇండియన్ టార్గెట్లపై దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

యూఎన్ఎస్‌సీలో భారత దేశ ప్రతినిధి, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా మాట్లాడుతూ, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను ఖండించాలని కోరారు. ఇదిలావుండగా, ఐక్యరాజ్య సమితిలోని భారత దౌత్యవేత్తల బృందం ఈ ముసాయిదా తీర్మానంపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి కృషి చేసినట్లు తెలిసింది.