తాలిబన్లు ఇకపై పాక్ చేతిలో కీలుబొమ్మలు కాకపోవచ్చు

ఆఫ్టనిస్తాన్ దేశాన్ని  స్వాధీనం చేసుకున్న తాలిబన్లను తక్కువగా అంచనా వేయొద్దని, వారు ఇక ముందు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలుగా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉందని ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ భావిస్తున్నారు. 
 
తాలిబన్లు ఇన్నేళ్లుగా పాకిస్తాన్ సహాయ సహకారాలతో మనుగడ సాగించారన్న విషయం అందరూ అంగీకరించాల్సిన పచ్చినిజమని ఆయన స్పష్టం చేశారు. ఇంతకాలం తమకు అండదండగా నిలిచి సహాయం చేసిన పాకిస్తాన్ నుంచి వారు విముక్తి కోరుకునే అవకాశం ఉందని, ఇక ముందు తాలిబన్లపై పాకిస్తాన్ ప్రభావం కొన్ని అంశాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు.

అఫ్గాన్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలనే అమెరికా నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమని ‘రిటర్న్‌ ఆఫ్‌ ఏ కింగ్‌: ది బ్యాటిల్‌ ఫర్‌ అఫ్గానిస్థాన్‌’ పుస్తక రచయిత విలియం డాల్రింపుల్‌ అభిప్రాయపడ్డారు. త‌న‌ది హేతుబద్ధమైన నిర్ణయమని అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించుకున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందార‌ని స్పష్టం చేశారు. 
 
ముఖ్యంగా అమెరికా విదేశీ విధానంలో గత వందేళ్లలో జరిగిన వ్యూహాత్మక తప్పిదాల్లో ఆఫ్ఘ‌న్‌ అంశమే అతిపెద్దదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.  తాలిబన్ల ఉద్యమం పాకిస్తాన్ ప్రేరేపిత ఉద్యమం అని చాలా మంది అభిప్రాయం నిజం కాదని, ఈ అభిప్రాయాలను తొలిగిపోయే రోజులు రానున్నాయని ఆయన తెలిపారు. 
 
తాలిబన్లది కచ్చితంగా ఆఫ్గనిస్తాన్ ఉద్యమమేనని, గత 25 ఏళ్లుగా తాలిబన్లకు నిధులు, ఆయుధాలు అందించి అండదండగా నిలిచిన పాక్ మద్దతు ఇప్పటికీ కొనసాగుతోందన్న విషయం అందరూ అంగీకరించాల్సిన నిజం అని పేర్కొన్నారు. 
 
తాలిబన్ల స్వయంప్రతిపత్తిని కొందరు తక్కువ అంచనా వేస్తున్నారని, ప్రస్తుతం వారి చేతిలోనే అధికారం ఉన్నందున ఇంతకాలం వారికి యజమానిగా ఉన్న పాకిస్థాన్‌ నుంచే విముక్తి కోరే అవకాశాలు లేకపోలేదని విలియం డాల్రింపుల్‌ భావిస్తున్నారు. ఇకపై పాకిస్తాన్ ప్రభావం తాలిబన్ల మీద అంశాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని, పాక్-తాలిబన్ల మధ్య అభిప్రాయభేదాలొస్తే.. తాలిబన్లు స్వతంత్రమార్గం అనుసరించడానికే మొగ్గు చూపించే అవకాశం ఉందని ఆయన వివరించారు.