తాలిబన్లతో భారత రాయబారి సమాలోచనలు

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత, భారత దేశంతో సంబంధాలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని వారి ప్రతినిధులు స్పష్టం చేసిన నేపథ్యంలో రెండు దేశాల సంబంధాల విషయంలో ఒక అడుగు పడినదని చెప్పవచ్చు. తాజాగా ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్  తాలిబన్‌ ప్రతినిధి షేర్ మహ్మద్ అబ్బాస్‌ మధ్య చర్చలు జరిగాయి. మంగళవారం దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. 
తాలిబన్ల  అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుపక్షాల మధ్య మొట్టమొదటి అధికారిక దౌత్య సంబంధాలపై జరిగిన ఈ సమావేశంలో భారత్‌ లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తాలిబన్‌ ప్రతినిధి హామీ ఇచ్చారు. అఫ్గన్‌ మట్టిని భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలకు ఏంతమాత్రం ఉపయోగించరాదని మిట్టల్ తాలిబన్లను కోరారు. ఈ చర్చల్లో అఫ్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, వారిని వేగంగా తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే అఫ్గాన్‌ జాతీయులు, ముఖ్యంగా మైనారిటీలు, భారతదేశాన్ని సందర్శించాలనుకునే వారి ప్రయాణ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చినట్టు  తెలిపింది. భారత్‌తోవాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తామని, తమ వల్ల  భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్ లో పెట్టుబడులు పెడుతున్న కీలక భాగస్వామి భారత్ కావడంతో భారత్ తో సంబంధాల విషయంలో తాలిబన్లు తొలినుండి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే 3 బిలియన్ డాలర్లును 500కు పైగా ప్రాజెక్ట్ లలో భారత్ ఖర్చు పెట్టింది. 

అత్యున్నత స్థాయి కమిటీ

మరోవంక, అఫ్గానిస్థాన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. అఫ్గాన్‌లో భారత్ తక్షణ ప్రాధాన్యతలపై దృష్టి సారించనున్నది. 
 
ప్రస్తుతానికి ఆ దేశంలో చిక్కుకు పోయిన భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురాడానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండు దశాబ్దాల్లో అఫ్గాన్‌లో భారత్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ దేశానికి పార్లమెంటు భవనాన్ని కూడా నిర్మించి ఇచ్చింది.
 
ఈ కమిటీ గత కొన్ని రోజులుగా భారతీయులను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావడం, అలాగే అక్కడ నుంచి వస్తున్న అఫ్గాన్ జాతీయులపై భారత్ లక్షంగా అఫ్గాన్ నుంచి ఎలాంటి ఉగ్రవాదానికి తావు లేకుండా చూడడం వంటి పరిణామాలపై చర్చిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనపై భారత్ వేచి చూసే ధోరణిలో ఉంది. అక్కడి పరిణామాలపై భద్రతా మండలి ప్రకటనతోపాటు, అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో నిశితంగా పరిశీలిస్తోంది.