గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసే వరకు పోరాటం

తెలంగాణలో అవినీతి, అక్రమాల పాలనపై బీజేపీ పూరించిన సమరశంఖం గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసే వరకు పోరాటం కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి సభ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే జరుగుతుందని ఆయన ప్రకటించారు. 
 
ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం రెండో రోజు షేక్ పేట్ ప్రాంతంలో కొనసాగుతోంది. మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఓల్డ్ సిటీ కి మెట్రో ఎందుకు రాలేదో ఎంఐఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీ కి మెట్రో వస్తే యువత కు ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే మెట్రోను ఇక్కడకు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. 
 
అభివృద్ధిలో పాత బస్తీని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీయాలని సంజయ్ స్థానిక ప్రజలను కోరారు.  పాతబస్తీలో ప్రతి హిందువూ ఇకపై ధైర్యంగా ఉండాలని.. ఆ ప్రాంతం ఏ ఒక్కరి సొంతం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కావాలనే సంఘవిద్రోహ శక్తులను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు.   
పాతబస్తీలో యువకులకు పాస్‌పోర్టులు, ఉద్యోగాలు వస్తలేవని.. గోల్కొండ కోట వద్ద సభలో సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీని హైటెక్‌ సిటీ చేయాలని కోరింది బీజేపీనే తప్ప.. కేసీఆర్‌, ఒవైసీ కాదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వపు మోచేతి నీళ్లు తాగే దుర్మార్గపు పార్టీ ఎంఐఎం అని మండిపడ్డారు.  ఎమ్మెల్యే రాజాసింగ్‌ హిందూ సమాజం కోసం మాట్లాడితే ప్రభుత్వం కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
2023 లో గోల్కొండ కోట మీద కాషాయపు జెండా ఎగురవేస్తామని, మొదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మి అమ్మవారి పరిసరల్లోనే చేస్తామని స్పష్టం చేశారు. బెదిరింపులతో తమను లొంగదీసుకోవడం సాధ్యం కాదని చెబుతూ దేనికి భయపడని పార్టీ బీజేపీ అని ఆయన తెలిపారు. 
 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు ఒక్క పథకం, ఒక్కపైసా ఇవ్వదని.. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి తమ పథకాలుగా చిత్రీకరించుకుంటోందని సంజయ్‌ మండిపడ్డారు. ‘‘కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నరు.. గుంటనక్కల్లా, దున్నపోతుల్లా దోచుకుని, దాచుకుని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. 
 
కేసీఆర్‌ ఏం చేసినా హుజూరాబాద్‌ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఈటల మరోసారి ఎమ్మెల్యేగాగెలువబోతున్నారని తేల్చిచెప్పారు. యాత్రలో భాగంగా ఆయన చిన్న వ్యాపారులు, కార్మికులు, వికలాంగులు, టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుల   ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  వీధి వ్యాపారులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేల సాయం గురించి వాకబు చేశారు. వారందరికీబీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
 
షేక్‌పేటలో మధ్యాహ్న భోజనం తర్వాత వర్షం పడినప్పటికీ.. షెడ్యూల్‌ ప్రకారం కార్యకర్తలు, నాయకులతో కలిసి  యాత్ర సాగించారు. షేక్‌పేటకు చేరుకోగానే గొల్లకురుమ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సినీనటి కరాటే కళ్యాణి బతుకమ్మలతో ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడకి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు స్వఛ్చందంగా పాల్గొంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్చందంగా తరలివచ్చి యాత్రలో పాల్గొంటున్న కార్పొరేటర్లకు, కార్యకర్తల శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని బండి సంజయ్ చెప్పారు.
కర సేవలో పాల్గొన్న వ్యక్తి స్వామి గౌడ్, నెలలో 20 రోజులు రాజాసింగ్ కోర్టులకు వెళ్తున్నడాంటే ధర్మం కోసమేనని ఆయన తెలిపారు. అక్టోబర్ 2 వరకు జరిగే యాత్రలో అందరూ స్వచ్చందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తోన్న భాగ్యనగర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.