భార‌త్‌కు మరో స్వర్ణం సాధించిన సుమిత్

జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త్‌కు ప‌త‌కాల పంట పండుతున్న‌ది. ఇప్ప‌టికే షూటింగ్ 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవ‌ని లెఖారా స్వ‌ర్ణం సాధించ‌గా.. ఇప్పుడు జావెలిన్ త్రోయ‌ర్ సుమిత్ అంటిల్ మ‌రో స్వ‌ర్ణాన్ని భార‌త్ ఖాతాలో చేర్చాడు. 

సుమిత్ అంటిల్ అత్య‌ధికంగా 68.55 మీట‌ర్ల దూరం త‌న ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. త‌న ఐదో అటెంప్ట్‌లో ఈ ఫీట్ సాధించడం ద్వారా సుమిత్ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. సుమిత్ అంటిల్  జావెలిన్ త్రోలో నేడు మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలుగొట్టి స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు.

హర్యానాకు చెందిన 23 ఏళ్ళ సుమిత్ 2015లో మోటార్ బైక్ ప్రమాదంలో తన కాలు కింది భాగాన్ని పోగొట్టుకున్నాడు. ఇదే పోటీలో ఉన్న మ‌రో భార‌తీయుడు సందీప్ కూడా అత్య‌ధికంగా 62.20 మీట‌ర్ల దూరం ఈటెను విసిరి తృటిలో కాంస్య ప‌తకాన్ని చేజార్చుకున్నాడు. సుమిత్ అంటిల్ సాధించిన గోల్డ్ మెడ‌ల్‌తో క‌లిపి పారాలింపిక్స్‌లో భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు రెండు బంగారు ప‌త‌కాలు సాధించిన‌ట్ల‌య్యింది. 

మొత్తం ప‌త‌కాల సంఖ్య ఏడుకు చేరింది. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌ నాలుగు పతకాలు సాధించగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. వాస్త‌వానికి భార‌త ఆట‌గాళ్లు సాధించింది 8 ప‌త‌కాలు కాగా, డిజేబిలిటీ క్లాసిఫికేష‌న్‌లో వినోద్‌కుమార్ అన‌ర్హుడిగా తేలింది. దాంతో అత‌నికి ద‌క్కిన కాంస్య ప‌త‌కాన్ని ర‌ద్దు చేశారు.

నిన్న జరిగిన ఎఫ్-52 ఈవెంట్‌లో డిస్కస్ త్రో ఆటగాడు వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 19.91 మీటర్ల దూరం విసిరి ఆసియా రికార్డు కూడా సృష్టించి మరీ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే, వైకల్య వర్గీకరణ విషయంలో తోటి అథ్లెట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన నిర్వాహకులు ఫలితాలు నిలిపివేశారు. 

వర్గీకరణ ప్రక్రియను సమీక్షించిన అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని నిన్ననే ప్రకటించారు. తాజాగా, వినోద్ కుమార్ వర్గీకరణ ప్రక్రియను సమీక్షించిన నిర్వాహకులు వినోద్‌ కుమార్‌ను అనర్హుడిగా తేల్చారు. దీంతో భారత్ తన ఖాతా నుంచి ఓ పతకాన్ని కోల్పోయింది. బలహీన కండరాల శక్తి, అవయవ లోపం లేదంటే కాళ్ల పొడవులో తేడా ఉన్నవాళ్లు ఎఫ్-52 కింద పోటీ పడే అవకాశం ఉంది.

ఈ నెల 22నే వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన నిర్వాహకులు అథ్లెట్ల జాబితాను కూడా రెడీ చేశారు. అప్పుడా జాబితాలో వినోద్ కుమార్ పేరు కూడా ఉంది. దీంతో నిన్నటి పోటీలో పాల్గొన్న వినోద్.. 19.91 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడా వర్గీకరణను సమీక్షించిన నిర్వాహకులు వినోద్ కుమార్‌ను అనర్హుడిగా ప్రకటించడంతో భారత్ ఓ పతకాన్ని కోల్పోయింది.