మతగురువు సర్దార్ జాద్రాన్‌ను అరెస్ట్ చేసిన తాలిబన్లు

అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరో దుశ్చర్యు పాల్పడ్డారు. ప్రముఖ మతగురువు మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు  వారు ఒక ఫోటోను విడుదల చేశారు. ఆఫ్ఘన్‌లో ప్రభావవంతమైన మతగురువుగా మొహమ్మద్‌ సర్దార్‌ పేరొందారు.
అఫ్గాన్‌ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను అరెస్టు చేశామని తాలిబన్లు సోమవారం ధ్రువీకరించారు మొహమ్మద్ మౌల్వీ కళ్లకు గంతలు కట్టి ఉన్న సర్దార్ జద్రాన్ ఫొటోను తాలిబన్లు  విడుదల చేశారు. కాగా ఇప్పటికే జానపద గాయకుడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో తొలి మహిళా గవర్నర్‌లలో ఒకరైన సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.
ఇలా ఉండగా,  అల్‌ఖైదా మాజీ చీఫ్‌, 2001 డ‌బ్ల్యూటీసీ ట‌వ‌ర్ల‌పై దాడి ప్ర‌ధాన సూత్ర‌ధారి ఒసామా బిన్ లాడెన్ సన్నిహితుడు అమినుల్ హ‌క్ మ‌ళ్లీ ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అడుగుపెట్టాడు. ఆ దేశం మ‌రోసారి తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఈ అల్‌ఖైదా ఉగ్ర‌వాది మ‌ళ్లీ త‌న సొంత ప్రావిన్స్ అయిన నంగార్‌హ‌ర్‌కి వ‌చ్చాడు. 
 
అత‌న్ని వాహ‌నంలో రావ‌డం చూసిన అక్క‌డి తాలిబ‌న్ల‌లో కొంద‌రు.. సెల్ఫీలు దిగ‌డానికి ఎగ‌బ‌డడం విశేషం. బిన్ లాడెన్ టోరా బోరాలో ఉన్న‌ప్పుడు అత‌నికి అమినుల్ హ‌క్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌గా ఉండేవాడు. ఆ త‌ర్వాత 1980ల్లో లాడెన్‌కు చేరువ‌య్యాడు. బిన్ లాడెన్‌ను అమెరికా బ‌ల‌గాలు 2011లో పాకిస్థాన్‌లో అబోటాబాద్‌లో మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే.
 
మరోవంక, అమెరికాపై తాలిబ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం ఓ పేలుడు ప‌దార్థాలు ఉన్న వాహ‌నాన్ని డ్రోన్ సాయంతో అమెరికా బ‌లగాలు పేల్చేసిన విష‌యం తెలుసు క‌దా. అయితే త‌మ‌కు చెప్ప‌కుండా ఈ దాడిని అమెరికా ఏక‌ప‌క్షంగా ఎలా చేస్తుంద‌ని తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి జ‌బీహుల్లా ముజాహిద్ ప్ర‌శ్నించాడు.
 
 చైనా అధికారిక చానెల్ సీజీటీఎన్‌తో సోమ‌వారం మాట్లాడిన అత‌డు.. ఈ డ్రోన్ దాడిలో ఏడుగురు పౌరులు చ‌నిపోయిన‌ట్లు చెప్పాడు. విదేశీ గ‌డ్డ‌పై అమెరికా ఇలాంటి చ‌ర్య తీసుకోవ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని జ‌బీహుల్లా అన్నాడు.