పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇవాళ పతకాల పంట పండింది. సోమవారం ఒకేరోజు నాలుగు పతకాలు సాధించింది. షూటింగ్‌లో బంగారు పతకం సాధించిన భారత్‌.. మరో మూడు పథకాలను తన ఖాతాలో వేసుకున్నది. డిస్కస్‌ త్రోలో రజతం, జావెలిన్‌ త్రోలో రజతం, కాంస్య పతకాలు లభించాయి.
 
మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో షూటర్‌ అవని లేఖారా స్వర్ణం పతకం సాధించింది. దీంతో షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. సోమవారం ఉదయం జరిగిన మహిళల షూటింగ్‌ విభాగంలో అవని లేఖారా బంగారు పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవనికి స్వర్ణ పతకం దక్కింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 621.7 స్కోరు సాధించిన అవని.. ఫైనల్లో అడుగుపెట్టింది. 
 

19 ఏళ్ల లేఖారా ఫైనల్లో మొత్తం 249.6 స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. ఆమె ప్రపంచ రికార్డును సమం చేసింది. ఆమె 621.7 స్కోరుతో క్వాలిఫికేషన్ రౌండ్‌లో 7 వ స్థానంలో నిలిచింది. షోపీస్ ఈవెంట్‌లో ఫైనల్‌కు వెళ్లడానికి నెమ్మదిగా ప్రారంభించిన తర్వాత అవని బాగా కోలుకుంది.

ఈ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్ రాజస్థాన్, జైపూర్ నుండి వచ్చింది.  ఆమె పింక్ సిటీలోని జేడీఏ షూటింగ్ రేంజ్‌లో శిక్షణ పొందుతుంది. 2012 లో జరిగిన ప్రమాదం కారణంగా ఆమె ట్రామాటిక్ పారాప్లేజియాకు గురైంది.

 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవనీని అభినందిస్తూ, “అసాధారణ ప్రదర్శన@అవనిలెఖారా! మీ శ్రమతో కూడిన స్వభావం, షూటింగ్ పట్ల ఉన్న మక్కువ కారణంగా ఆసక్తితో  కష్టపడి సంపాదించి, అర్హత సాధించిన బంగారాన్ని గెలుచుకున్నందుకు అభినందనలు. ఇది నిజంగా భారత క్రీడలకు ప్రత్యేక క్షణం. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. భారతదేశపు మొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకం గెలుచుకున్న షూటర్ అభినవ్ బింద్రా కూడా అవనిపై ప్రశంసలు కురిపించారు.
 
కాగా, భారతదేశానికి గర్వకారణంగా, భారత డిస్కస్ త్రోయర్ యోగేష్ కథునియా ఫైనల్ ఎఫ్56 విభాగంలో రజతం సాధించాడు. యోగేష్ 44.38 మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో 2 వ స్థానంలో నిలిచాడు.
 
24 ఏళ్ల, న్యూఢిల్లీలోని కిరోరిమల్ కాలేజీ నుండి బి.కామ్ గ్రాడ్యుయేట్, రజతం సాధించడానికి తన ఆరవ, చివరి ప్రయత్నంలో డిస్క్‌ను 44.38 మీటర్ల ఉత్తమ దూరానికి పంపాడు. సైనికుని కుమారుడైన కథునియా ఎనిమిదేళ్ల వయసులో పక్షవాతానికి గురై, అవయవాలలో సమన్వయ లోపాలను ఎదుర్కొన్నాడు.

ఇక జావెలిన్‌ త్రోలో దేవేంద్ర ఝజారియాకు రజతం లభించగా, సుందర్‌ సింగ్‌కు కాంస్యం గెలుపొందాడు. కాగా, టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఓ స్వర్ణం, మూడు రజతాలు ఉన్నాయి. నిన్న హైజంప్‌లో నిషాద్‌, టేబుల్‌ టెన్నిస్‌లో భవీనాబెన్‌ రజత పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు పతకాలు సాధించింది వీరే

1. అవని లేఖారా- గోల్డ్‌ మెడల్‌ (షూటింగ్‌)

2. యోగేశ్ కధూనియా- సిల్వర్‌ మెడల్‌(డిస్కస్ త్రో)

3. నిశాద్‌ కుమార్‌-  సిల్వర్‌ మెడల్‌(హైజంప్‌)

4.భవీనాబెన్‌ పటేల్‌-  సిల్వర్‌ మెడల్‌(టేబుల్‌ టెన్నిస్‌)

5. దేవంద్ర ఝజారియా-  సిల్వర్‌ మెడల్‌(జావిలన్‌త్రో)

6. సుందర్‌ సింగ్‌- కాంస్య పతకం(జావిలన్‌త్రో)

7. వినోద్‌ కూమార్‌- కాంస్య పతకం(డిస్కస్ త్రో)