ఆఫ్ఘన్ పరిణామాలతో భారత్ పై ఉగ్ర ప్రమాదం!

ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లు భారత దేశ భద్రతపై చూపగలిగే ప్రభావం గురించి భారతీయ సైనిక దళాలు అప్రమత్తం అవుతున్నాయి. భారత్ కు కొత్తగా ఏర్పడగల ఉగ్రవాద, భద్రతాపర సవాళ్ల గిరినుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో త్రివిధ దళాల అధిపతులు ఓ అధ్యయనాన్ని నిర్వహింపనున్నాయి.

ఆఫ్ఘనిస్థాన్‌లో బలపడిన తాలిబన్లకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో అన్ని విధాలుగా అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ కేంద్రాలుగా పనిచేస్తున్న అన్ని రకాల ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ శిక్షణ సదుపాయాలతో పాటు ఆయుధాలు, ఇతర వనరులు కూడా సమకూరుస్తున్నాయి. ఒక విధంగా వాటికి మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాయి.

తాలిబన్‌లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. తాలిబన్లకు పాకిస్థాన్‌లోని తెహరీక్-ఈ-తాలిబన్, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు సైద్ధాంతిక, కార్యకలాపాలకు సంబంధించిన అనుబంధం ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ఆధిపత్యం సంపాదించడంతో భారత దేశంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో త్రివిధ దళాల అధిపతులు అధ్యయనం చేస్తారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు లేనందువల్ల ఈ అంశం తొలిసారి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఆఫ్ఘనిస్థాన్‌లో బిలియన్ల డాలర్ల విలువైన హార్డ్‌వేర్‌ను అమెరికా వదిలిపెట్టింది. భారత ఉప ఖండంలోని జీహాదిస్టులు ఎం-4, ఎం-16 వంటి అత్యాధునిక రైఫిల్స్‌ను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిలిటరీ గ్రేడ్ నైట్ విజన్ డివైసెస్, వ్యూహాత్మక డ్రోన్లు, ఇతర ఆయుధాలను జీహాదిస్టులు సేకరించే అవకాశం అధికంగా ఉంది.

అమెరికాలో తయారైన ఈ మిలిటరీ హార్డ్‌వేర్ పంజాబీ ఇస్లామిస్ట్ గ్రూపులకు చేరే అవకాశం కనిపిస్తోంది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు ఈ ఆయుధాలు చేరి, భారత దేశంలోని కశ్మీరుపై దాడులు పెరగవచ్చు. ఆఫ్ఘనిస్థాన్‌లో వదిలిపెట్టిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్లను, అన్ని రకాల పరిస్థితుల్లోనూ పని చేసే మిలిటరీ వాహనాలను  తాలిబన్లు నడపగలిగితే, భద్రత పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. 

ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లకు, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలకు సత్సంబంధాలు ఉన్నాయి. భారత దేశంలో ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే, అందుకు బాధ్యత తమది కాదని పాకిస్థాన్ తప్పించుకోగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాలిబన్లు ఇరవయ్యేళ్ళ క్రితం ఆఫ్ఘనిస్థాన్‌ను పరిపాలించినప్పటి మాదిరిగానే, ఇప్పుడు కూడా ఉగ్రవాద సంస్థలు తమ శిక్షణ శిబిరాలను ఆ దేశానికి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలకు తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్ మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్నారు. 

భారత దేశానికి తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో చైనా సైన్యం సమస్యలు సృష్టిస్తూండగా, పశ్చిమం వైపున చైనా, పాకిస్థాన్‌ల మద్దతుతో జీహాదిస్టులు భారత దేశంపై ఒత్తిడి పెంచుతాయని అంచనా వేస్తున్నారు. సముద్రంపై పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అండదండలు అందిస్తున్నాయి. కాబట్టి తీర ప్రాంతంలో ఉగ్రవాద దాడులతో భారత దేశంపై ఒత్తిడి పెంచుతారని భావిస్తున్నారు. 

తాలిబన్ల చేతుల్లో భారీగా అమెరికా ఆయుధాలు 

ఏకకాలంలో ఆఫ్ఘన్ సైన్యం, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అమెరికాకు చెందిన అత్యంత ఆధునిక ఆయుధాలు చాలావరకు తాలిబాన్ల చేతిలో పడ్డాయని నిపుణులు చెప్తున్నారు. బలమైన సైన్యాన్ని పెంచడానికి తాలిబాన్‌కు ఈ ఆయుధాలు సరిపోతాయని వారంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కోసం కొనుగోలు చేసిన ఆయుధాలు, సైనిక పరికరాల ఆడిట్ నివేదికలను అమెరికా ప్రభుత్వం దాచిపెట్టింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో 8,84,311 ఆధునిక సైనిక పరికరాలను అమెరికా వదిలిపెట్టింది.

వీటిలో ఎం16 రైఫిల్స్‌, ఎం4 కార్బన్లు, 82 మిమీ మోర్టార్ లాంచర్లు, హమ్వీ, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఏ29 యుద్ధ విమానాలు, రాత్రి వేళ చూసేందుకు ఉపయోగించే పరికరాలు, కమ్యూనికేషన్, నిఘా పదాతిదళ ఆయుధాలు ఉన్నాయి. వీటిలో 75,898 వాహనాలు, యుద్ధట్యాంకులు, 5,99,690 తుపాకులు, 208 వివిధ రకాల విమానాలు ఉండటం విశేషం.

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఏజెన్సీ (డీఎల్‌ఏ) డాటా బేస్ అధ్యయనం ద్వారా ఫోర్బ్స్ ఈ డాటాను సేకరించింది. ఇలాఉండగా, 2017 లో ఆఫ్ఘనిస్తాన్‌ నేషనల్‌ ఆర్మీ కోసం తెచ్చిన అమెరికా ఆర్మీకి చెందిన రూ.1,250 కోట్ల విలువచేసే స్కాన్‌ ఈగల్‌ డ్రోన్స్‌ కనిపించడం లేదని తెలుస్తున్నది.