రాముడు లేకుండా అయోధ్య లేదు

 ‘రాముడు లేకుండా అయోధ్య లేదు. అయోధ్య కాదు. రాముడు ఇక్కడే పుట్టాడు. రాముడు ఇక్కడే శాశ్వతంగా నివసించాడు. రాముడితోనే అయోధ్య కలిసి ఉన్నది’ అని భారతదేశం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్న రామ్‌నాథ్‌ కోవింద్‌ రామ మందిరం నిర్మాణం పనులను సందర్శించారు. అనంతరం అయోధ్య పట్టణంలో నిర్వహించిన రామాయణ సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.

తన పేరును ప్రస్తావిస్తూ.. ‘నా కుటుంబ సభ్యులు నాకు పేరు పెట్టినప్పుడు, సాధారణ ప్రజల్లో కనిపించే రాముడి కథ, రాముడు పట్ల గౌరవం, ఆప్యాయతను వారు కలిగి ఉన్నారని నేను భావిస్తున్నాను’ అని చెప్పారు. 

భాషాపరంగా చూస్తే, అయోధ్య అంటే యుద్ధంలో మరెవ్వరు విజయం సాధింపలేని ప్రదేశం అని అర్ధం అని రాష్ట్రపతి తెలిపారు. రఘు, దిలీప్, దశరథ్, రామ్ వంటి రఘువంశ రాజుల ధైర్య, సాహసాల కారణంగా వారి రాజధాని అభేద్యంగా పేరొందినదని, అందుకనే `అయోధ్య’ ఎల్లప్పటికీ ప్రాధాన్యత సంతరింప చేసుకొంటూనే ఉంటుందని స్పష్టం చేశారు. 

ఆదివాసీల పట్ల రాముడికి ఉన్న ప్రేమను ఎత్తి చూపుతూ అజ్ఞాతవాస కాలంలో రాముడు యుద్ధం చేయడానికి అయోధ్య, మిథిలా సైన్యాలను పిలువలేదని చెప్పారు. ఆయన కోల్స్, భీల్స్, వానర్లను సేకరించి తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, చివరకు జటాయువును కూడా తన సైన్యంలో చేర్చుకున్నాడని  గుర్తు చేశారు. ఇది రాముడికి గిరిజనులతో ఉన్న ప్రేమ, స్నేహాన్ని వ్యక్తపరుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రామాయణ సమ్మేళనానికి సంబంధించిన పోస్టల్ కవర్‌ను రాష్ట్రపతి కోవింద్‌ ఆవిష్కరించారు.

ప్రపంచంలో అనేక దేశాలలో రామకథను స్మరించుకొంటున్నారని చెబుతూ ఇండోనేసియా లోని బాలి ద్వీపంలో రామకథ ప్రసిద్ధి చెందినదని రాష్ట్రపతి తెలిపారు. మాల్దీవులు, మారిషస్, ట్రినిడాడ్, టొబాగో, నేపాల్, కంబోడియా, సురినామ్ లతో సహా అనేక దేశాలలో ప్రవాస భారతీయులు రామకథను, రామలీలను సజీవంగా ఉంచారని కొనియాడారు. థాయిలాండ్ లో నెలకొన్న ఆయుత్తాయ నగరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఆదర్శ భారత దేశంపై `రామరాజ్య’ అనే కల్పనను ఇవ్వడం ద్వారా ప్రజా జీవనంలో  శ్రీరాముడిని ఆదర్శ పాలకుడిగా ప్రజల ముందు ఉంచారని రామనాథ్ కోవింద్ గుర్తు చేశారు. గాంధీజీకి శ్రీరాముడి పేరు చాల ముఖ్యమైనదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ, కేంద్ర సహాయ మంత్రి దర్శన్‌ విక్రమ్‌ జర్దోష్‌ తదితరులు పాల్గొన్నారు.

2019 లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు అనంతరం, రామ జన్మభూమి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.ఉత్తర ప్రదేశ్ లో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి లక్నో నుండి రైలులో అయోధ్యకు చేరుకున్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు  మొదటిసారిగా అయోధ్య వచ్చిన ఆయన రామలీల వద్ద పూజలు జరిపారు.