ఆఫ్ఘన్ నుండి జర్నలిస్టుల వలస … టీవీల్లో మహిళల నిషేధం

ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు మీడియాపై విరుచుకు పడుతున్నారు. దానితో భయంతో ఆఫ్ఘన్‌ జర్నలిస్టులు కూడా దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సుమారు 2వేల మంది జర్నలిస్టులు ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచి వెళతామంటూ అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఐఎఫ్‌జె)కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

మరోవంక,  టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై నిషేధం విధిస్తూ  కఠినమైన ఆంక్షలు జారీ అయ్యాయి. అలాగే, తాలిబన్లు సంగీతంపై కూడా తమ వ్యతిరేకతను చాటుకున్నారు. సంగీత ప్రసారాలను నిలిపివేయాలంటూ టీవీ, రేడియో మాధ్యమాలకు హుకుం జారీ చేశారు. 

1996-2001 మధ్య కాలంలో కూడా తాలిబన్లు ఇదే తరహాలో సంగీతంపై ఆంక్షలు విధించారు. క్యాసెట్ టేపులు, మ్యూజిక్ సిస్టమ్స్‌ను అప్పట్లో వారు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే, అఫ్గాన్ రేడియో స్టేషన్లలో ఇస్లామిక్ సంగీతం మాత్రం నిరభ్యంతరంగా ప్రసారం చేసుకోవచ్చని తాలిబన్లు ప్రకటించడం గమనార్హం.

దీంతో వారిని కాబుల్‌ విమానాశ్రయానికి  జర్నలిస్టులు సురక్షితంగా చేరుకునేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ ఐఎఫ్‌జె తాలిబన్లను సంప్రదించింది. అలాగే వారికి వీసాలు జారీ చేయాలని స్పెయిన్‌, ఫ్రాన్స్‌, మెక్సికో, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌, అమెరికా, కెనడాతో పాటు మరికొన్ని దేశాలకు ఐఎఫ్‌జె విజ్ఞప్తి చేసింది. అయితే ఒక్కో దేశం కేవలం 10 నుండి 15 జర్నలిస్టులకు మాత్రమే ఆశ్రయం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో విదేశాలకు వెళ్లాలనుకునే మీడియా ప్రతినిధులను ఎయిర్‌పోర్టుకు రాకుండా తాలిబన్‌ సైన్యం అడ్డుకుంటుందని, దీంతో తాలిబన్లు సహకారం అందించాలని ఇంటర్నేషనల్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ తాలిబన్లకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఒక జానపద గాయకుడిని హత్య చేశారు. 

ఇటీవలి వారాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో, తాలిబాన్ జర్నలిస్టులపై జరుపుతున్న భౌతిక దాడులు పెరుగుతూ ఉండడం పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఇళ్లపై దాడి చేయడం,  మహిళా స్టేట్ టీవీ యాంకర్‌లను ప్రసారం చేయకుండా అడ్డుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.

ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబాన్ నియంత్రణలోకి వచ్చినప్పటి నుండి, అంతర్జాతీయ జర్నలిస్ట్ ల పరిరక్షణ సంఘం కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజే)  దాదాపు 400 మంది జర్నలిస్టుల తరలింపు అవసరమయ్యే కేసులను నమోదు చేసి, వెయ్యి అదనపు అభ్యర్థనలను పరిశీలిస్తోంది.

సిపిజె, 50 కి పైగా ఇతర పౌర సమాజ సంస్థలు ఆఫ్ఘనిస్తాన్‌లో జర్నలిస్టులు, మీడియాలో పనిచేసేవారిని రక్షించి, వారి తరలింపుకు అవకాశం కల్పించాలని జి -7 దేశాలకు పిలుపునిచ్చాయి. అమెరికా దళాల ఉపసంహరణ గడువు ఆగష్టు 31 ముగిసిన తర్వాత కూడా, అమెరికా, మిత్రదేశాల దళాలు కాబుల్ లోనే ఉండాలని కూడా కోరాయి.

జర్నలిస్టులపై హింసను ఉపయోగించడాన్ని తాలిబాన్ తక్షణమే నిలిపివేయాలి,  ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే క్లిష్టమైన వార్తలను స్వేచ్ఛగా, భయం లేకుండా కవర్ చేయడానికి అనుమతించాలని సిపిజే విజ్ఞప్తి చేసింది. ఆగష్టు 25న తాలిబాన్ దళాలు ప్రైవేట్ యాజమాన్య బ్రాడ్‌కాస్టర్ టోలో న్యూస్ రిపోర్టర్ జియార్ ఖాన్ యాద్‌పై దాడి చేశాయి.  రైఫిల్స్‌తో అతని నడుముపై కొట్టారు.  అతను రోజువారీ కూలీలను ఇంటర్వ్యూ చేస్తుండగా అతని ముఖంపైకొట్టారు.

ఆగష్టు 18 న జరిగిన ఒక ప్రత్యేక సంఘటనలో, తాలిబాన్ దళాలకు చెందిన వారు ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రసారకర్త ఖుర్షీద్ టీవీ రిపోర్టర్ అహ్మద్ నావిద్ కవోష్‌ని మెడ, భుజాలు, నడుము, తొడలు, పాదాలపై కొరడాతో కొట్టారు. మరొకడు తాలిబాన్ ఫైటర్ కావోష్ ఛాతీపై తుపాకీని గురిపెట్టాడు. ఆ ప్రాంతం విడిచి వెళ్లకపోతే, అతనిని  జైలుకు పంపుతామాని, అతని కెమెరాను పగలగొడతానని బెదిరించాడు.

ఆగస్ట్ 18 న, ప్రైవేట్ యాజమాన్య వార్తా సంస్థ పజ్వోక్ ఆఫ్ఘన్ న్యూస్‌తో వీడియో రిపోర్టర్ బాబ్రాక్ అమిర్జాదా,  ప్రైవేట్ యాజమాన్యంలోని న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాడ్‌కాస్టర్ అరియానా న్యూస్‌తో కెమెరా ఆపరేటర్ అయిన మహమూద్ నయీమిని కూడా కొట్టడం వంటి పలు సంఘటనలు సిపిజే దృష్టికి వచ్చాయి. 

కాగా, ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత  మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని, వారు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చని చెప్పిన తాలిబన్లు  రోజుల వ్యవధిలోనే మాట మార్చారు. వారి మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో మహిళలు తమ రోజువారీ కార్యకలాపాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల్లోని మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.