అవసరమైతే ఆఫ్ఘన్ లో సైనిక చర్యకు భారత్ సిద్ధం

ప్రస్తుతం భారత్‌ ఆఫ్ఘన్‌పై పురాలోచిస్తుందని, కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. అవసరమైతే అక్కడి గడ్డపైకి వెళ్లి సైనిక ఆపరేషన్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

తమిళనాడులోని వెల్లింగ్టన్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో రక్షణ మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులే భారత్‌ వ్యూహాన్ని మార్చాయని చెప్పారు. తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు పెను సవాలుగా మారాయని, ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి తెలిపారు. 

 శత్రువులను నిర్మూలించేందుకు, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంటిగ్రేటెడ్‌ బాటిల్‌ గ్రూప్‌ ఏర్పాటును రక్షణ మంత్రిత్వశాఖ వేగంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఎందుకంటే.. యుద్ధ సమయాల్లో ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ముఖ్యమని, ఈ యుద్ధ బృందాలు వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. యుద్ధ విభాగాలను సైతం సిద్ధం చేస్తాయని, శత్రువులను నిర్మూలిస్తాయని వివరించారు.

భారత యువత సైనికుల్లా దేశభక్తిని, క్రమశిక్షణను నేర్చుకోవాలనేది తమ ప్రయత్నమని రక్షణ మంత్రి తెలిపారు. ఇందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. దీని కోసం రక్షణ మంత్రిత్వశాఖ టూర్‌ ఆఫ్‌ డ్యూటీని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 

ఈ నిర్ణయం గేమ్‌ ఛేజింగ్‌గా ఉంటుందని, అలాగే భారత సైన్యం సగటు వయసును కూడా తగ్గిస్తుందని భావిస్తున్నట్లు రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి పాక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ధృడ వైఖరి అవలంభిస్తూ ఉన్నదుననే పాక్‌ మౌనంగా ఉంటోందని స్పష్టం చేశారు. 

గత ఏడాది భారత్ – చైనా సరిహద్దులో ఏర్పడిన వివాదం తీవ్రమైన పరిష్టితులకు దారితీసినదని గుర్తు చేస్తూ మన సైనికులు చాలా సాహసంతో, అప్రమత్తంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఏకపక్షంగా మార్చాలని చైనా ప్రయత్నించడంతోనే అటువంటి పరిస్థితి ఏర్పడినదని విమర్శించారు. 

ఈ సంఘటన తర్వాత ఎటువంటి యుద్దనైనా, ఎటువంటి  పరిస్థితినైనా, ఏ ప్రదేశంలోనైనా, ప్రమాదాలను లెక్క చేయకుండా ఎదురుకోవడానికి మన సైన్యం అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టమైనదని రక్షణమంత్రి తెలిపారు. అదే మన జాతీయ భద్రతకు భరోసా ఇస్తున్నాడని చెప్పారు. రెండు యుద్ధాల్లో ఓడిపోయిన తర్వాత పాక్‌ భారత్‌పై ఉగ్రవాదానికి పాల్పడడం ప్రారంభించిందని గుర్తు చేశారు. ఉగ్రవాదులకు ఆయుధాలు ఇవ్వడంతో పాటు శిక్షణ ఇస్తుందని ఆరోపించారు.  ప్రస్తుతం భారత్‌-పాక్‌ మధ్య సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పారు.  

మనం బలంగా ఉన్నామని, అవసరమైతే ప్రతిచర్యకు సిద్దమనే సంకేతం ఇవ్వడం కారణంగానే భారత్ –  పాక్ సరిహద్దులో కాల్పుల విరమణ విజయవంతంగా అమలు జరుగుతున్నదని స్పష్టం చేశారు. భారత్‌ రక్షణాత్మక వైఖరిని వీడి ప్రతిస్పందించడం ప్రారంభించిందని పాక్‌కు తెలుసని పేర్కొన్నారు. 

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశ రక్షణ విషయంలో రాజీ ధోరణి అనుసరించడం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉండడం కారణంగానే ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయగలుగు తున్నామని తెలిపారు. 2016లో బాలాకోట్ దాడులతో ఈ విషయం ప్రపంచానికి తెలిసివచ్చిందని గుర్తు చేశారు.