‘టోక్యో ఒలింపిక్స్ ద్వారా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆటల గురించే చర్చించుకోంటున్నారు. ఇది శుభపరిణామం. ప్రతి కుటుంబం ఇలాగే ఆలోచిస్తూ క్రీడల్లో ముందడుగు వేసేలా భవిష్యత్ తరాన్ని ప్రోత్సహించాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుకుచేసుకున్నారు. ఈ సందర్భంగా ‘సబ్ ఖేలే.. సబ్ ఖిలే’ అనే కొత్త నినాదాన్ని ప్రజలకు ఇచ్చారు.
‘ధ్యాన్‌చంద్ జీ ఆత్మ ఎక్కడ సంతోషంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ధ్యాన్ చంద్ హాకీ ప్రపంచంలో భారత హాకీని అంత ఎత్తున నిలిపారు. 4 దశాబ్దాల తర్వాత భారతదేశం పురుషులు, మహిళల జట్లు హాకీలో తమ ప్రావీణ్యాన్ని చూపి ప్రపంచం ఆశీస్సులను అందుకున్నారు’ అని కొనియాడారు.
మన దేశం తరఫున ఎన్ని పతకాలు సాధించినా.. హాకీలో పతకం వచ్చినప్పుడే భారతీయుడు నిజమైన సంతోషం పొందుతాడని పేర్కొంటూ, ఈసారి హాకీలో పతకం రావడంతో ధ్యాంచంద్ జీ జీవితం క్రీడలకు అంకితమైన ఆయన ఆత్మ సంతోషంగా ఉంటుందని మోదీ తెలిపారు. దేశంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో క్రీడా పోటీలు క్రమం తప్పకుండా జరగాలని చెబుతూ, ప్రతివారి భాగస్వామ్యంతోనే క్రీడలలో భారత దేశం ఉన్నత శిఖరాలకు చేరుకోగలదని ప్రధాని స్పష్టం చేశారు.
నేటి యువత విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారని చెబుతూ ఒకరు తయారు చేసిన మార్గాన్ని అనుసరించడం వీరికి ఇష్టం లేదు. ఎవరికి వారు కొత్త మార్గాల్లో నడవాలనుకుంటున్నారు. వీరి గమ్యం, మార్గం, కోరిక కొత్తగా ఉంటున్నాయని ప్రధాని వివరించారు.
రానున్న రోజుల్లో అంతరిక్ష పరిశోధనల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటారన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. యువత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, చిన్న పట్టణాల్లోనూ స్టార్టప్స్ ప్రారంభించేందుకు ఉత్సుకత చూపించడం యువత ఆత్మస్థైర్యానికి నిలువుటద్దం అని చెప్పారు.
జన్మాష్ఠమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ ప్రపంచంలోని ప్రజలు భారతదేశం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్నందున మనం కూడా దానిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పండుగలను జరుపుకుంటూనే సైన్స్, సంస్కృతిని అర్థం చేసుకుందామని చెప్పారు. ఈ వారసత్వాన్ని రాబోయే తరాలకు అందజేద్దామని పిలుపునిచ్చారు.
‘మన్ కీ బాత్’ కేవలం భారత దేశానికే పరిమితం కాలేదని, అంతర్జాతీయ స్థాయికి చేరిందని, విదేశాల్లోని భారతీయులు కూడా తనకు సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన ప్రతిసారీ ఆటోమేటిక్‌గా ఇండోర్ గుర్తుకొస్తుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో ఇండోర్ ఉందని తెలిపారు. అయితే ఇండోర్ ప్రజలు సంతృప్తి చెందలేదని, దేశంలో తొలి వాటర్ ప్లస్ నగరంగా ఇండోర్‌ను నిలిపారని అన్నారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు