భవీనాబెన్‌కు రాష్ట్రపతి, ప్రధాని మోదీ అభినందనలు

టోక్యో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన భవీనాబెన్‌ పటెల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు,  ప్రధాని మోదీ అభినందించారు. ఆమె అసాధారణ సంకల్పం దేశానికి కీర్తిని తెచ్చాయని, ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడారు. 

సిల్వల్‌ మెడల్ సాధించిన భవీనాకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘పారాలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన భవీనా.. భారత బృధానికి, క్రీడాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ అసాధారణ సంకల్పం, నైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. మీకు నా అభినందనలు’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

భవీనాబెన్‌ పటేల్‌ను ఉపరాష్ట్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం అని తెలిపారు. ‘టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని  ట్విట్టర్‌ ద్వారా అభినందించారు.

భవీనాకు ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతూ భవీనా పటేల్ చరిత్ర సృష్టించారని, భారత్‌కు అత్యంత ప్రతిష్టాత్మక రజత పతకం తీసుకువచ్చారని కొనియాడారు. ‘భవీనా పటేల్‌ చరిత్ర లిఖించింది. దేశానికి ఆమె చారిత్రక సిల్వర్‌ మెడల్‌ తీసుకొస్తున్నది. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి, ఆమె ప్రయాణం యువతను క్రీడలవైపు ఆకర్షిస్తున్నది’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

భ‌వీనా ప‌టేల్‌కు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఆమె సాధించిన విజ‌యానికి బ‌హుమానంగా భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని దివ్యాంగ్ ఖేల్ ప్ర‌తిభా ప్రోత్సాహ‌న్ పుర‌స్కార్ యోజ‌న కింద రూ.3 కోట్లు భ‌వీనా ప‌టేల్‌కు న‌జ‌రానాగా అంద‌జేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 

ఆమె స్వస్థలమైన గుజ‌రాత్ రాష్ట్రంలోని మెహ‌సానా ప‌ట్ట‌ణంలో సంబురాలు అంబ‌రాన్నంటాయి. కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అంతా క‌లిసి భ‌వీనా విజ‌యం సాధించిన ఘ‌డియ‌లు పండుగ‌లా జ‌రుపుకున్నారు. ఒక‌రికొక‌రు స్వీట్లు పంచుకున్నారు. పటాకులు కాల్చారు.

అనంత‌రం గుజ‌రాతీ సంప్ర‌దాయ నృత్య‌మైన గార్బా డ్యాన్స్‌తో అల‌రించారు. భ‌వీనా త‌ల్లిదండ్రుల‌తోపాటు, స్నేహితులు, ఊరివాళ్లు అంతా క‌లిసి నృత్యం చేశారు. ఈ సంద‌ర్భంగా భ‌వీనా తండ్రి హ‌స్ముఖ్‌భాయ్ ప‌టేల్ మాట్లాడుతూ.. త‌మ కూతురు తామంతా గ‌ర్వ‌ప‌డేలా చేసింద‌ని సంతోషం ప్రకటించారు. ఆమె స్వ‌దేశానికి రాగానే మెహ‌సానాలోకి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లుకుతామ‌ని చెప్పారు.