జలియన్‌వాలా బాగ్ స్మారకం ప్రారంభించిన ప్రధాని

పంజాబ్‌ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ స్మారకంగా )  పునరుద్ధరించిన కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సాయంత్రం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, గవర్నర్‌ వీపీ సింగ్‌ బద్నోర్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ల సమక్షంలో కొత్తగా పునరుద్ధరించిన కాంప్లెక్స్‌ను మోదీ ప్రజలకు అంకితం చేశారు. 1919 నాటి ఘటనలను గుర్తుకు తెచ్చే విధంగా సౌండ్ అండ్‌ లైట్‌ షోను కూడా నిత్యం వీక్షించే ఏర్పాట్లు చేశారు.

జలియన్ వాలా బాగ్ ప్రదేశం ఎందరో మంది స్వాతంత్య్ర వీరులకు ధైర్యాన్నిచ్చిన ప్రదేశమని మోదీ పేర్కొన్నారు. సర్దార్ ఉద్ధమ్ సింగ్, భగత్ సింగ్ లాంటి అనేక మంది విప్లవకారులకు ఈ ప్రదేశం ధైర్య సాహసాలను నూరిపోసిందని తెలిపారు. జలియన్ వాలాబాగ్‌తో పాటు మరికొన్ని స్మారకాలను పునరుద్ధరించడం అంటే స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడమే అని చెప్పారు. 

స్వాతంత్య్ర పోరాటంలో దేశంలోని గిరిజనులు అనేక త్యాగాలు చేసి, వీరోచితంగా పోరాడినా, వారి వీరోచిత గాథలు చరిత్ర పుటల్లోకి ఎక్కలేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వాన్నీ అర్పించిన వీరులను గుర్తించకపోవడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రజలు విభజనకు అతిపెద్ద బాధితులని, ఇప్పటికీ కాస్త ప్రభావం కనిపిస్తుందని మోదీ తెలిపారు. 

‘ధైర్యవంతులైన పంజాబ్, పవిత్రమైన జలియన్‌వాలాబాగ్ భూమికి సెల్యూట్ చేస్తున్నా. విభజన సమయంలో, అనంతరం జరిగినా సంఘటనలు దేశంలోని ప్రతి మూలలోనూ, ముఖ్యంగా పంజాబ్‌లో మనం చూడొచ్చు. అప్పటి భారతదేశ ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తుచేసుకోవడానికి ఏటా ఆగస్టు 14 ను విభజన భయానక జ్ఞాపక దినంగా గుర్తించాం’ అని నరేంద్ర మోదీ తెలిపారు.

జలియన్ వాలా బాగ్ మెమోరియల్ శాంతియుత ప్రజాస్వామ్య నిరసనకు ప్రజల హక్కు గురించి భవిష్యత్‌ తరాలకు తప్పనిసరిగా రిమైండర్‌గా ఉపయోగపడుతుందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ మారణకాండలో షహీద్ ఉధమ్ సింగ్ వాడిన పిస్టల్‌తోపాటు ఆయన వ్యక్తిగత డైరీ వంటి వాటిని బ్రిటీష్‌ ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించాలని ప్రధాని మోదీకి కెప్టెన్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.